శంక‌ర్‌ ని సూటిగా తాకిన ప్ర‌శ్న‌

Update: 2018-11-27 04:48 GMT
శంక‌ర్ సినిమా అంటే సామాజిక సందేశంతో పాటు - క‌చ్ఛితంగా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. పూర్తిగా సామాన్యుడికి అర్థ‌మ‌య్యే భాష‌లో కొన్ని స‌న్నివేశాలు ఉంటాయి. అవి మాస్‌ ని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. సినిమా ఎండ్ అయ్యే వ‌ర‌కూ అలాంటి మెరుపులు మ‌ధ్య‌లో వ‌చ్చి వెళుతుంటాయి. అదే ఫార్ములాని జెంటిల్‌ మేన్ నుంచి అనుస‌రించారాయ‌న‌. అప‌రిచితుడు - రోబో లాంటి చిత్రాల్లోనూ శంక‌ర్ ఉప‌యోగించారు. ముఖ్యంగా సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో తీసిన `రోబో` చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ సిస్ట‌ర్‌ కి చిట్టీ పురుడు పోయ‌డం.. అలాగే ఒక కాల‌నీ సందులో చిట్టీ వెళుతుంటే అయ‌స్కాంతానికి చిక్కిన బోల్టులు - ఐర‌న్ రాడ్లు చూసి - అమ్మ‌వారే దిగొచ్చార‌ని భ‌క్తులు పూన‌కం వ‌చ్చి ఊగిపోవ‌డం - పూజ‌లు చేసేయ‌డం... అక్క‌డ రౌడీల్ని చిట్టీ చిత‌క్కొట్ట‌డం - ట్రెయిన్‌ లో విల‌న్ల బారిన ప‌డిన ఐసూని కాపాడేందుకు చిట్టీ సాహ‌సాలు చేయ‌డం.. ఇవ‌న్నీ చాలా సామాన్యుల‌కు సైతం క‌నెక్ట‌య్యే పాయింట్స్. అందుకే హైఫై సాంకేతిక‌త‌తో తీసినా.. పూర్తిగా మ‌న లోకల్ ఐడియాలిజీ ఉన్న వాళ్ల‌కు ఏం కావాలో అదే చూపించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈసారి 2.ఓ చిత్రంలో అలాంటివి ఉంటాయా? అస‌లు మాస్‌ కి కావాల్సిన‌వి ఇందులో ఉంటాయా?

ప్ర‌శ్న మ‌రీ లోక‌ల్ గా.. నాటుగా ఉన్నా కాస్త ఆలోచిస్తే పై సంగ‌తులన్నీ గుర్తొస్తాయి. ఇదే ప్ర‌శ్న‌ను 2.ఓ హైద‌రాబాద్ ప్ర‌మోష‌న్స్‌ లో శంకర్‌ ని అడిగితే ఆయ‌న చాలా బాగా క్యాచ్ చేశారు. సెల్‌ ఫోన్ అనేది అంద‌రి చేతిలో ఉండేదే క‌దా! అది ప్ర‌తి సామాన్యుడికి క‌నెక్ట‌య్యే పాయింటే క‌దా? అని ఎదురు ప్ర‌శ్నించిన‌ శంక‌ర్ పై ప్ర‌శ్న‌కు వివ‌ర‌ణ ఇచ్చి క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. 

2.ఓ చిత్రంలో ఇంత‌కుముందు చూడ‌ని కొత్త అంశాలెన్నో ఉంటాయి. సాంకేతిక‌త‌ - వీఎఫ్ ఎక్స్ మాయాజాలంతో పాటు ఎమోష‌నల్ కంటెంట్ చాలానే ఉంటుంది. ట్రైల‌ర్‌ లో మీకు అవ‌న్నీ చూపించ‌లేదు అని శంక‌ర్ అన్నారు. 3డి విజువ‌ల్స్‌ తో పాటు ఎమోష‌న్ ముందుకు న‌డిపిస్తుంటుంది.. సామాజిక సందేశం అంద‌రికీ క‌నెక్ట‌య్యేలా ఉంటుంద‌ని అన్నారు. ఇలాంటి సినిమాల్ని ఆద‌రిస్తే మ‌రిన్ని మంచి సినిమాల‌ను తెర‌కెక్కించేందుకు ఆస్కారం ఉంటుంద‌ని - ఈ సినిమా కోసం ట‌న్నుల కొద్దీ ఎఫ‌ర్ట్ పెట్టి ఎంద‌రో నిపుణులు ప‌ని చేశార‌ని తెలుగు మీడియాని శంక‌ర్ అభ్య‌ర్థించారు. శంక‌ర్ చెప్పిన‌ది అంతా బాగానే ఉంది. అయితే `ఐ` చిత్రంలో బీస్ట్ ని చూపించి ఇంకేదో చేసిన‌ట్టు అస‌లు విష‌యం చూపించ‌కుండా క‌థ న‌డిపించాల‌నుకుంటే అది త‌ప్పిదం అవుతుంది. అలాంటి త‌ప్పిదం `2.ఓ` విష‌యంలో రిపీట్ కాద‌నే ఆశిద్దాం.
Tags:    

Similar News