తెరపైకి 'శేఖర్' వివాదం: కోర్టుకు వెళ్లిన ఫైనాన్షియర్.. కేసు వేస్తానన్న ప్రొడ్యూసర్..!

Update: 2022-05-21 15:07 GMT
టాలీవుడ్ లో జీవిత - రాజశేఖర్ దంపతులు ఇటీవల కాలంలో పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. 'గరుడ వేగ' సినిమాకు సంబంధించిన లావాదేవీల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండగా.. తాజాగా "శేఖర్" మూవీ ఫైనాన్షియర్ వివాదం తెర మీదకు వచ్చింది.

జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో ఆమె భర్త డాక్టర్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం "శేఖర్". శుక్రవారం (మే 20) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా కోసం తన వద్ద అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వడం లేదంటూ ఓ ఫైనాన్షియర్ కోర్టుకు వెళ్లారు.

'శేఖర్' సినిమా కోసం తన దగ్గర 65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న నిర్మాత, దర్శకురాలు శ్రీమతి జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించడం లేదంటూ ఏ. పరంధామరెడ్డి అనే ఫైనాన్షియర్ హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

ఈ ఫిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. 48 గంటలలోగా అనగా ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోగా రూ. 65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ గా కోర్టులో శ్రీమతి జీవిత రాజశేఖర్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అలా డిపాజిట్ చేయలేనిపక్షంలో ''శేఖర్" సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను అటాచ్మెంట్ చేయనున్నట్లు పేర్కొంది.

అనగా థియేటర్స్ లో కానీ డిజిటల్ - శాటిలైట్ - ఓటీటీ - ఎటీటీ - యూట్యూబ్ వంటి వివిధ రకాల ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాతో పాటు ట్రైలర్ - పాటలతో సహా ఎలాంటి కంటెంట్ ను ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో అటాచ్మెంట్ అమలులోకి వస్తే ఆదివారం సాయంత్రం తర్వాత "శేఖర్" సినిమాను ఏ ఫ్లాట్ ఫామ్స్ లో ఎవరు ప్రదర్శించినా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి హెచ్చరించారు.

అయితే దీనిపై 'శేఖర్' సినిమా నిర్మాతల్లో ఒకరైన బీరం సుధాకర్ రెడ్డి స్పందించారు. రాజశేఖర్ గారు కథానాయకుడిగా జీవిత దర్శకత్వంలో రూపొందించిన సినిమాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ సినిమా జోలికి వచ్చినా.. నష్టం కలిగించినా కేసు వేస్తానని నిర్మాత హెచ్చరించారు.

బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ''నేను 'శేఖర్' చిత్రానికి నిర్మాతను. హీరో రాజశేఖర్ మరియు దర్శకురాలు జీవితా రాజశేఖర్ గారికి పారితోషికాలు పూర్తిగా చెల్లించాను. ఈ సినిమా రాజశేఖర్ - జీవిత గార్లది అనుకుని ఎవరో కోర్టుకు వెళ్లారు. నా సినిమాకు వాళ్ళు నష్టం కలిగిస్తే.. ఏదైనా జరిగితే నేను పరువు నష్టం దావా కేసు వేస్తా. నేను నష్టపోయిన మొత్తాన్ని వాళ్ళ నుంచి రాబడతా. నా చిత్రాన్ని ఎవరికీ అమ్మకూడదని ఏదో చెబుతున్నారు. అది చెల్లదు. ఎందుకంటే అసలు నిర్మాతను నేనే'' అని అన్నారు.

కాగా, 'శేఖర్' చిత్రాన్ని వంకాయలపాటి మురళీ కృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్పొరేషన్ - సుధాకర్ ఇంపెక్స్ ఐపియల్ - త్రిపురా క్రియేషన్స్ - టారాస్ బ్యానర్లపై బీరం సుధాకర్ రెడ్డి - శివాని రాజశేఖర్ - శివాత్మిక రాజశేఖర్ - బొగ్గారం వెంకట శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారని పోస్టర్స్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు అసలు నిర్మాత తనే అని సుధాకర్ రెడ్డి అంటున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News