బాహుబలి వర్సెస్‌ 300: ఓ ఏడు పోలికలు

Update: 2015-06-24 11:30 GMT
ప్రస్తుతం ఏ నోట విన్నా బాహుబలి గురించిన చర్చ సాగుతోంది. ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రను తిరగరాస్తుందని, రికార్డుల మోత మోగిస్తుందని అనుకుంటున్నారంతా. అంతేకాదు 300, ట్రాయ్‌ రేంజులో హాలీవుడ్‌ ప్రమాణాలతో మెస్మరైజ్‌ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంతే కాదండోయ్‌ రాజమౌళి ఫేవరెట్‌ సినిమా 300తో ఏడు పోలికలు ఉన్నాయంటూ ఆధారాలు చూపిస్తున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, కలర్‌ గ్రేడింగ్‌, రొమాన్స్‌, జంప్స్‌, సీనరీస్‌ ఇలా ప్రతిదానికి పోలిక చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దామా?

=బాహుబలిలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కచ్ఛితంగా 300ని పోలి ఉంటాయన్న ఊహాగానాలున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌, రానా సింగిల్‌ హ్యాండ్‌తో సైనికుల్ని ఊచకోత కోసే సన్నివేశాలు 300ని ప్రతిబింబిస్తుంది. కత్తి తిప్పడం, ఈటె విసరడం, నరకడం, గుర్రపుస్వారీలు వగైరా వగైరా అదే స్థాయిలో ఉంటాయని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. హాలీవుడ్‌ సినిమాల ఇన్‌స్పిరేషన్‌తోనే రాజమౌళి పక్కాగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని ప్లాన్‌ చేసి ఉంటారని అంటున్నారు.

=విజువల్‌ ఎఫెక్ట్స్‌లో క్రియేట్‌ చేసిన కింగ్‌ డమ్‌, వాటర్‌ ఫాల్‌ లొకేషన్స్‌ను పరిశీలిస్తే ఓమారు 300లో కొన్ని లొకేషన్లు ఛూఛాయగా కనిపిస్తాయి. రెండు కొండల నడుమ వాటర్‌ ఫాల్స్‌ ముందు లోయలోకి జంప్‌ చేస్తున్న ప్రభాస్‌ని, అలాగే రెండు కొండల మధ్య మాటు వేసి 300 యోధులు జెరిక్సిస్‌ మహారాజు పంపిన సైన్యాన్ని తునాతునకలు చేసే ముందు ఆ లొకేషన్‌ని పరిశీలిస్తే ఈ రెండిటికీ లింకు పెట్టాల్సొస్తోంది. ఆ రెండు లొకేషన్లు అచ్చం అలానే ఉన్నాయని అంటున్నారు. జాక్‌ స్నయిడర్‌లానే రెండేళ్లు పైగానే విఎఫ్‌ఎక్స్‌ కోసం కసరత్తు చేశాడు రాజమౌళి. కాబట్టి ఆ స్థాయిలో విజువల్స్‌ బాహుబలిలో కనిపిస్తున్నాయన్న టాక్‌ వచ్చింది.

=నాజర్‌ బాహుబలిలో బిజ్జలదేవ అనే వికలాంగుని పాత్రలో నటించాడు ఈ చిత్రంలో. ఒక చెయ్యి హ్యాండి కేప్డ్‌. 300 సినిమాలో ఎఫిలేట్స్‌ పాత్రతో పోలిక ఉన్న పాత్ర ఇది. ఎఫిలేట్స్‌ వికృతంగా కనిపించే వికలాంగుడు. ముఖంపై కందగడ్డ లాంటి బొడిపె, వీపుపై పెద్ద మూపురంలాంటి గడ్డ .. పూర్తిగా వొంగిపోయిన నడుము, వంకీలు తిరిగిన చేతులు, కాళ్లు.. ఈ రూపం చూస్తేనే భయం వేస్తుంది. ఈ పాత్ర వింతైన ఆకృతిలోనే కాదు కన్నింగ్‌ స్వభావం ఉన్న పాత్రగా చూపించారు 300లో. అదే తరహాలో బాహుబలిలో ఒక చెయ్యి అవిటిది అయిన బిజ్జలదేవ కన్నింగ్‌ స్వభావం ఉన్నవాడిగా కనిపిస్తున్నాడు.

=300లో కింగ్‌ లినైడస్‌ భార్యగా లీనా హెడే నటించింది. భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మధ్య కుటుంబ అనుబంధాలు, రొమాన్స్‌కి సంబంధించిన పార్ట్‌ను లీనాపై చిత్రీకరించారు. ఈ పాత్రతో తమన్నా పాత్రకు పోలికలు కనిపిస్తున్నాయి. తమ్మూ ట్రైలర్‌లో కనిపించిన తీరు లీనాని తలపించిందని అంటున్నారు.

=300మంది దేశభక్తి నిండిన యోధులు స్పార్టన్‌ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి తమకంటే వంద రెట్టు బలం ఉన్న జక్షిస్‌ మహారాజుపై దండెత్తడానికి బయల్దేరతారు. అదే తీరుగా శివుడు పాత్రధారి అయిన ప్రభాస్‌ అతికొద్ది మందితో అత్యంత బలవంతుడైన భళ్లాల దేవ మహారాజుపై దండెత్తడానికి వెళతాడు. లక్షలాది సైన్యంతో విరోచితంగా పోరాడుతాడు. అక్కడ స్పార్టన్‌కింగ్‌గా లియోనార్డ్‌ ప్రత్యర్థిపై విరుచుకుపడితే ఇక్కడ గిరిజన గూడెం కుర్రాడిగా శివుడు (ప్రభాస్‌) తలపడతాడు. రెండుచోట్లా సయోధ్య కుదర్చడానికి దూత వస్తాడు. చావుదెబ్బ తింటాడు.

=ప్రభాస్‌-రానా ఇద్దరూ 8నెలల పాటు కొత్త రూపం కోసం పాకులాడారు. తీవ్రంగా జిమ్ము చేసి కండలు పెంచారు. ఆరుపలకల్ని పెంచారు. ఇదంతా స్పార్టన్‌ వీరుల పోలికల్ని చూపిస్తోంది. ఈ ఇద్దరిలో రానా పోలికలు స్పార్టన్లకు దగ్గరగా ఉన్నాయి. ఈటె పట్టిన స్పార్టన్‌ కింగ్‌, గద పట్టిన రానాకి మధ్య పోలికల్ని చెబుతున్నారంతా.

Tags:    

Similar News