పవన్ - బాలయ్య లతో వర్క్ చేయకపోవడంపై శ్రీను వైట్ల స్పందన..!

Update: 2021-11-09 11:33 GMT
యాక్షన్‌ కు తనదైన శైలి కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల. చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోల దగ్గర నుంచి.. మహేష్ బాబు - రవితేజ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల వరకు అందరితో సినిమాలు చేసాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో నందమూరి బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ లతో మాత్రం వైట్ల శ్రీను వర్క్ చేయలేకపోయారు. అందుకు తాను బాగా ఫీల్ అవుతున్నట్లు తాజాగా ఓ టాక్ షో లో దర్శకుడు తెలిపారు.

అలీ హోస్ట్ చేసే కార్యక్రమంలో పాల్గొన్న శ్రీను వైట్ల.. పవన్ కల్యాణ్ కు తనకు బాగా సింక్ అవుతుందని అన్నారు. "పవన్ కల్యాణ్ తో సినిమా చేసి ఉంటే బాగుండేది. ఆయనతో నాకు బాగా సింక్ ఉంటుందని నా ఫీలింగ్. ఆయన బాడీ లాంగ్వేజ్ కు నేను బాగా సూట్ అవుతానని నా స్ట్రాంగ్ ఫీలింగ్. పవన్ నుంచి ఆఫర్ కూడా వచ్చింది. కానీ అది జరగలేదు. రెండు సార్లు కలిశాం.. కానీ కథ చెప్పలేదు. ఆ టైమ్ లో పవన్ కు సరిపోయే లైన్ నేను పట్టుకోలేకపోవడం వల్ల అది జరగలేదు" అని శ్రీను వైట్ల తెలిపారు.

సీనియర్ హీరోలలో బాలకృష్ణ తో సినిమా చేయలేకపోయిన విషయాన్ని కూడా శ్రీను వైట్ల వెల్లడించారు. ''బాలకృష్ణ గారిని రెండు సార్లు కలవడం జరిగింది. కానీ కథలు చెప్పలేదు. ఆయనంటే చాలా ఇష్టం. అందరు దర్శకులు బాలయ్యను ఒకేలా చూపిస్తున్నారు. దాన్ని అలానే ఉంచుతూనే ఎంటర్టైనింగ్ గా బాలయ్యను చూపించాలని అనుకున్నాను. ప్రయత్నం కూడా చేశాను. భవిష్యత్ లో ఆయనతో కలిసి చేసే ఆస్కారం తప్పకుండా వస్తుందేమో చూద్దాం'' అని వైట్ల శ్రీను చెప్పుకొచ్చారు.

'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ప్లాప్ అయిన తర్వాత గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్ల.. ఇప్పుడు మంచు విష్ణుతో ''డి అండ్‌ డి'' (డబుల్ డోస్) సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇది ఆయన గత చిత్రాల శైలిలో హిలేరియస్ గా ఉంటుందని.. మీమర్స్ కు కావాల్సినంత స్టఫ్ దొరుకుతుందని దర్శకుడు హామీ ఇస్తున్నారు. అలానే మరో రెండు స్క్రిప్ట్స్ టైటిల్స్ తో సహా సిద్ధంగా ఉన్నాయని శ్రీను వైట్ల తెలిపారు. ఈ మూడు సినిమాలు అనుకున్న విధంగా వస్తే మహేష్ బాబు ను వెళ్లి కలుస్తానని.. ఇప్పటికే రెండు ఐడియాస్ ఉన్నాయని.. వాటిలో ఒకటి పిక్ చేసుకొని నెరేట్ చేస్తానని వైట్ల శ్రీను తెలిపారు. 'ఆగడు' సినిమా పరాజయం అవడంతో మహేష్ తాను బాధ పడ్డామని.. ఈ ప్లాప్ కు పూర్తిగా తనే బాధ్యత వహిస్తానని అన్నారు.
Tags:    

Similar News