జక్క‌న్న పాఠం బాలీవుడ్ బుర్ర‌ల‌కెక్కుతోందా?

Update: 2022-06-02 04:30 GMT
బాహుబ‌లి రిలీజ్ అనంత‌రం దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ముఖ్యంగా రాజ‌మౌళి- ఆర్కా మీడియా చేసిన ప్ర‌చారంపై బాలీవుడ్ నిపుణులు ఎంత‌గానో విశ్లేషించారు. బాహుబ‌లి ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీని.. టార్గెట్ చేసిన ఆడియెన్ రేంజును అర్థం చేసుకోవాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ క‌ర‌ణ్ జోహార్ స‌హా త‌ర‌ణ్ ఆద‌ర్శ్ వంటి ప్ర‌ముఖ క్రిటిక్ విశ్లేషించారు. కానీ బాహుబ‌లి-1.. బాహుబ‌లి 2 లాంటి సంచ‌ల‌నాల‌ త‌ర్వాత కూడా బాలీవుడ్ ఇంకా పాత దారిని విడిచిపెట్ట‌లేదు. దాని ప‌ర్య‌వ‌సానం ఇప్ప‌టికీ అక్క‌డ స‌రైన హిట్టు లేదు.

అడ‌పాద‌డ‌పా క్లాసిక్స్ వ‌చ్చి ఉత్త‌రాది వ‌ర‌కూ చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించినా కానీ బాలీవుడ్ సినిమాలేవీ ఇంత‌వ‌ర‌కూ సౌత్ మార్కెట్లో ఏమాత్రం స‌త్తా చాట‌లేక‌పోయాయి. భారీ సినిమాలు ఎన్ని వ‌చ్చినా యాక్ష‌న్ బేస్డ్ చిత్రాలు ఇక్క‌డ రిలీజైనా వాటి ప్ర‌భావం జీరో. దానికి కార‌ణం సౌత్ ని లైట్ తీస్కోవ‌డ‌మే. ఇక్క‌డ‌ జీరో ప్ర‌మోష‌న్స్ హిందీ సినిమాకి శాప‌మైంది.

అయితే బాలీవుడ్ స్టార్ల‌కు ఎక్కిన మ‌త్తు ఇంకా వ‌ద‌ల్లేదా? అంటే ... అవున‌నే వారు లేక‌పోలేదు. కానీ ఇప్పుడు ఆ మ‌త్తును నెమ్మ‌దిగా దించుకునే ప్ర‌య‌త్నంలో కొంద‌రు స్టార్లు ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మెట్రో న‌గ‌రంగా ఇంకా ఎద‌గ‌ని టూటైర్ న‌గ‌రానికి ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి స్టార్ వ‌చ్చి త‌న సినిమా బ్ర‌హ్మాస్త్ర‌కు ప్ర‌చారం చేసుకున్న తీరు చూస్తుంటే విస్మ‌యం క‌ల‌గ‌క మాన‌దు.

నిజానికి పెద్ద స్టార్ల సినిమాల‌కు కేవ‌లం మెట్రోల‌కు వ‌చ్చి ప్ర‌చారం చేసే అల‌వాటు బాలీవుడ్ స్టార్ల‌కు చాలా కాలంగా ఉంది. కానీ అనూహ్యంగా ర‌ణ‌బీర్ లాంటి స్టార్ బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో ఆంధ్రా తీర ప్రాంతం అయిన‌ విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌చారానికి దిగ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

చూస్తుంటే ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ విష‌యంలో జ‌క్క‌న్న ఏం చెబితే అది చేసేందుకు ర‌ణ‌బీర్ రెడీ అవ్వ‌డం నిజంగానే షాకిస్తోంది. కపూర్ కి ఒక ర‌కంగా మ‌త్తు దిగింది. దించేలా చేసాడు జ‌క్క‌న్న‌. ఇక ఏనాడూ విశాఖ విజ‌య‌వాడ తిరుప‌తి లాంటి చోట్ల పెద్ద‌గా క‌నిపించ‌ని ఇత‌ర బాలీవుడ్ స్టార్లు ఇక‌పై ర‌ణ‌బీర్ అడుగు జాడ‌ల్లో ప్ర‌మోష‌న్స్ కోసం దిగిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. నెక్ట్స్ అమీర్ న‌టించిన లాల్ సింగ్ చ‌ద్దా ప్ర‌మోష‌న్స్ కోసం ఎంత‌కైనా దిగొస్తార‌న‌డంలో సందేహం లేదు. క‌పూర్ దిగొచ్చాడు. ఖాన్ ల త్ర‌యం దిగొస్తారు.

కుమార్ లు బ‌చ్చ‌న్ లు రోష‌న్ లు డియోలు లు కూడా ఇక‌పై ద‌క్షిణాది భార‌తదేశంలోని ప‌ల్లెటూళ్ల‌కు కూడా దిగిపోతారేమో చూడాలి. ప్ర‌మోష‌న్స్ కోసం అంత చేయ‌క‌పోతే లైఫ్ టైమ్ పూర్త‌యినా ఉత్త‌రాది స్టార్ల‌ను ద‌క్షిణాదిన ఎక్క‌డా ప‌ట్టించుకోరు. ఎన్ని గొప్ప క్లాసిక్స్ తీసినా జ‌నంలోకి వెళ్ల‌క‌పోతే ఎవ‌రికీ క‌నిక‌రం ఉండ‌దు. అయినా ఓటీటీలు దండీగా అందుబాటులో ఉన్న ఈ కాలంలో పొరుగు హీరోల కోసం థియేట‌ర్ల‌కు అస‌లే వెళ్ల‌రు. ఒక‌వేళ దీనిని అధిగ‌మించి ద‌క్షిణాదినా అడుగ‌డుగునా ప్ర‌మోష‌న్స్ చేయ‌గ‌లిగితే తెలుగు స్టార్ల‌తో క‌లిసి మల్టీవ‌ర్స్ లు క్రియేట్ చేయ‌గ‌లిగితే అప్పుడు బాలీవుడ్ వాళ్లు కూడా పాన్ ఇండియా స్టార్లు అవుతార‌న్న‌మాట‌!! ప్చ్!!
Tags:    

Similar News