తమ వాట్సాప్ గ్రూప్ లోని స్టార్స్ పేర్లు చెప్పిన సుహాసిని!

Update: 2022-04-25 23:30 GMT
సాధారణంగా ఎవరైనా పెద్ద వారిని పలకరించినప్పుడు 'ఆ రోజులు వేరు' అంటూ ఉంటారు. అప్పటి స్నేహాలు .. ప్రేమలు .. ఆప్యాయతలు ఇప్పుడు లేవనే ఉద్దేశంతో నిట్టూర్చుతూ ఉంటారు. ఇక సినిమా ఫీల్డ్ కి సంబంధించి సీనియర్ స్టార్స్ ను పలకరిస్తే కూడా అదే మాట అంటారు. ఒకప్పుడు తామంతా షూటింగు సమయంలో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్లమనీ, కష్టసుఖాలు చెప్పుకునేవాళ్లమని అంటారు. షూటింగు సమయంలో చెట్ల క్రిందనే కూర్చుని భోజనాలు చేసేవాళ్లమని చెబుతుంటారు.

ఇప్పటి పరిస్థితి వేరు .. షాట్  ఓకే కాగానే ఎవరి కారవాన్ లోకి వాళ్లు వెళ్లిపోతారు. ఒకవేళ సెట్లోనే ఉండవలసి వస్తే ఎవరి ఫోన్ పట్టుకుని వాళ్లు తలో మూలకూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.

ఎవరికి వారు ఆ సీన్ వరకూ .. ఆ సినిమా వరకూ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండటం బాధను కలిగిస్తూ ఉంటుందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కుర్రకారుతో మనకెందుకులే .. మనం మాత్రం అప్పటిలానే ఆప్యాయంగా ఉందాం .. అదే స్నేహాన్ని కొనసాగిద్దాం అన్నట్టుగా 80వ  దశకంలోని హీరోహీరోయిన్లంతా ఒక గ్రూప్ గా ఏర్పడిపోయారు.

సౌత్ లోని సీనియర్ హీరోహీరోయిన్లంతా చాలా కాలంగా ఏడాదికి ఒకసారి ఏదో ఒక ప్లేస్ లో కలుసుకుంటున్నారు.  ఏదో ఒక  థీమ్ పెట్టుకుని అదే కలర్ డ్రెస్ లను ధరిస్తూ హాజరవుతున్నారు. ఆనాటి కబుర్లు .. ఈనాటి విశేషాలను పంచుకుంటూ వెళుతున్నారు.

ఈ తారలందరి మధ్య  ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. అందరి కలిసినప్పటి ఫొటోలను .. వీడియోలను షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ గ్రూప్ లో చురుకైన పాత్రను పోషించేది సుహాసిని అనే చెప్పాలి. తాజా ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడుతూ తమ అందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని చెబుతూ, ఆ గ్రూప్ లోని స్టార్స్ పేర్లు చెప్పుకొచ్చింది.

చిరంజీవి .. రజనీకాంత్ .. మమ్ముట్టి .. మోహన్ లాల్ .. వెంకటేశ్ .. నాగార్జున .. జగపతిబాబు .. సుమన్ .. శరత్ కుమార్ .. ప్రభు .. భాగ్యరాజ్ ..  జయసుధ .. జయప్రద .. రాధిక .. సుహాసిని .. రాధ .. రేవతి .. సరిత .. నదియా .. ఊర్వశి .. ఇలా 30 మంది పేర్లు ఆ జాబితాలో కనిపిస్తున్నాయి. ఈ రంగుల ప్రపంచంలో నిన్నటి స్నేహాన్ని నేడు కొనసాగించడం విశేషంగానే చెప్పుకోవాలి.

అయితే ఇంతకుముందు హీరోహీరోయిన్లు కలిసి ఎక్కువ సినిమాలు చేసేవారు. అందువలన వాళ్లమధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఈ జనరేషన్ హీరో హీరోయిన్ల మధ్య అలాంటి ఒక వాతావరణం కనిపించదు. ఇప్పుడు ఇద్దరూ కలిసి పట్టుమని ఓ నాలుగు సినిమాలు చేసే పరిస్థితిలేకపోవడమే అందుకు ప్రధానమైన కారణంగా చెప్పుకోవాలి.
Tags:    

Similar News