స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహ రెడ్డి చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ - కోలీవుడ్ - మాలీవుడ్ స్టార్ హీరోలు నటించబోతున్నారు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి తరహాలోనే ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా క్రేజ్ తీసుకురావాలని నిర్మాత రామ్ చరణ్ ఫిక్స్ అయ్యారట. అందుకే బడ్జెట్ కు వెనుకాడకుండా ఈ సినిమాను రూపొందించబోతున్నారని వినికిడి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విడుదలకు ముందే సంచలనాలు రేపుతోంది. ఈ నేపథ్యంలో సైరా డిజిటల్ రైట్స్ కోసం ఆన్ లైన్ సంస్థల మధ్య తీవ్రపోటీ ఏర్పడిందని వినికిడి.
ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు శాటిలైట్ కాపీ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్..సైరా డిజిటల్ రైట్స్ కోసం భారీ ధర చెల్లించేందుకు ముందుకు వచ్చిందట. ఈ సినిమాకు సంబంధించిన, మోషన్ పోస్టర్ - టీజర్ - ట్రైలర్ - పాటలు - సినిమాలకు మొత్తంగా కలిపి నిర్మాత రామ్ చరణ్ కు కళ్లు చెదిరే డీల్ ఆఫర్ చేసిందట. ఒకవేళ రామ్ చరణ్ ఆ డీల్ కు ఒప్పుకుంటే ప్రొడక్షన్ వ్యయంలో 20 శాతం వరకు వచ్చినట్లే అని వినికిడి. అయితే, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాతే ఈ డీల్ ఫైనలైజ్ చేయాలని చెర్రీ ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ఆ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి బిజినెస్ డీల్స్ ను అంగీకరించలేదని తెలుస్తోంది.