సంక్రాంతి బరిలో దిగుతున్న డబ్బింగ్ సినిమా మంచి వసూళ్లు రాబట్టేనా..?

Update: 2021-01-07 08:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ''మాస్టర్''. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ చిత్రానికి 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. ఎక్స్ బి ఫిల్మ్ క్రియేటర్స్ బ్యానర్ పై జేవియర్ బ్రిట్టో నిర్మించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు. ఇక 'మాస్ట‌ర్' సినిమాకు సంబంధించిన తెలుగు హ‌క్కుల‌ను నిర్మాత మహేష్ కోనేరు దాదాపు 8 కోట్ల‌కి ద‌క్కించుకున్నాడని టాక్. ఇదే కనుక నిజమైతే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత మొత్తం వెన‌క్కు రాబ‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మే అని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.

'మాస్టర్' సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే తెలుగు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా 3 కోట్లు పైగా రాబట్టాలని.. మిగ‌తా 5 కోట్ల‌కి థియేట్రిక‌ల్ బిజినెస్ జరగాల్సి వుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలను తట్టుకుని ఈ డబ్బింగ్ సినిమా ఎంత మేరకు వసూళ్లు రాబడుతుందనేది చూడాలి. అందులోనూ వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ ఆశ కూడా పోయింది. కాకపోతే విజయ్ కి తెలుగులో ఉన్న మార్కెట్.. 'ఖైదీ' తో లోకేష్ కనగరాజన్ ఏర్పరచుకున్న ఇమేజ్ ఈ చిత్రానికి ప్లస్ అవ్వొచ్చు. ఈ నేపథ్యంలో 'మాస్టర్' తెలుగు వర్షన్ నిర్మాతలను గట్టెక్కిస్తుందేమో చూడాలి. కాగా, 'మాస్టర్' సినిమాలో విజయ్ కాలేజ్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించగా ఆండ్రియా కీలక పాత్రలో కనిపించనుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Tags:    

Similar News