ఏపీలో పండ‌గ సినిమాల టికెట్ రేట్ల‌ ప‌రిస్థితేంటీ?

Update: 2023-01-04 17:30 GMT
టాలీవుడ్ కు ఈ సంక్రాంతి ప్ర‌త్యేకం అని చెప్ప‌క త‌ప్ప‌దు. కార‌ణం దాదాపు ఎనిమిదేళ్ల విరామం త‌రువాత ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు పోటీకి దిగుతున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ `వీర సింహారెడ్డి`తో బ‌రిలో దిగుతుండ‌గా, మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌`తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. వీటితో త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు పోటీ ప‌డుతున్నా ఎక్క‌డా వాటి హ‌డావిడి క‌నిపించ‌డం లేదు.

అంతే కాకుండా తెలుగు ప్రేక్ష‌కులు కూడా డ‌బ్బింగ్ సినిమాల కంటే తెలుగు సినిమాల‌పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో బాల‌కృష్ణ న‌టిస్తున్న `వీర సింమారెడ్డి`, చిరు `వాల్తేరు వీర‌య్య‌`పైనే అంద‌రి దృష్టి నెల‌కొంది. ఈ రెండు సినిమాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన విష‌యం తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాల‌తో తొలి సారి మైత్రీ వారు డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి ప్ర‌వేశిస్క‌తున్నారు. స్వ‌యంగా వారే ఈ మూవీస్ ని రిలీజ్ చేసుకుంటుండ‌టంతో ప్ర‌తీ విష‌యంలోనూ జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

సంక్రాంతి బ‌రిలో రెండు భారీ సినిమాలని బ‌రిలోకి దించేస్తున్న మైత్రివారు టికెట్ రేట్ల విష‌యంలో రాజీప‌డ‌టం లేద‌ట‌. తెలంగాణ‌లో టికెట్ రేట్ల విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు లేవు కాబ‌ట్టి ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కోసం అప్పుడే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశార‌ట‌. గ‌త కొంత కాలంగా ఏపీలో పెద్ద సినిమాల‌కైనా ఒక‌టే రేటుని ఏపీ ప్ర‌భుత్వం ఫిక్స్ చేయ‌డం తో చాలా వ‌ర‌కు నిర్మాత‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  
 
తెలంగాణ‌లో సింగిల్స్ స్క్రీన్ ల‌కు ఆరు షోలు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. అంతే కాకుండా మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో భారీగానే టికెట్ రేట్లు పెంచుకునే వెలుసు బాటుని తెలంగాణ ప్ర‌భుత్వం సంక్రాంతి సినిమాల‌కు క‌లిగించ‌డంతో మైత్రీవారి దృష్టి ఇప్పుడు ఏపీ పై ప‌డింది. `వీర సింమారెడ్డి`, `వాల్తేరు వీర‌య్య‌` సినిమాల టికెట్ ధ‌ర‌ల‌ని పెంచుకునేలా ఏపీ ప్ర‌భుత్వ అధికారుల్ని మైత్రీవారు క‌లిసిన‌ట్టుగా తెలుస్తోంది.

త్వ‌ర‌లోనే టికెట్ రేట్ల‌పై ఏపీ ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం వుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. చిరు, బాల‌య్య అంటే ఏపీ సీఎంకు ఇష్ట‌మే కాబ‌ట్టి సంక్రాంతి సినిమాల విష‌యంలో సానుకూలంగా స్పందిస్తార‌ని అంతా భావిస్తున్నారు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఏపీ టికెట్ రేట్ల విధానంపై భిన్నాప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News