హైద్రాబాద్ లో షూటింగా.. బాబోయ్

Update: 2017-09-14 09:54 GMT
పక్క రాష్ట్రాల్లోనో.. దేశాల్లోనో పాటలు షూటింగ్ చేసుకునే కల్చర్ టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. అయితే.. ఈ మధ్య సినిమాల స్టైల్ మారిపోతోంది. ఒకట్రెండు సీన్స్ కోసమే కాదు.. ఏకంగా సగానికి సగం మూవీ పరాయి దేశాల్లోనే షూటింగ్ చేసేస్తున్నారు. అంతే కాదు.. అదంతా ఇండియాలోనే అనిపించేలా కూడా కొన్ని సినిమాలు ఉంటున్నాయి. అసలు ఇలా సొంత ప్లేస్ ను వదిలేసి ఇతర ప్రాంతాల్లో షూటింగ్ లు చేసుకుంటే.. ఆ కిక్కే వేరని డైలాగులు కూడా చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో నిన్ను కోరి.. లై.. ఫిదా.. పైసా వసూల్ చిత్రాల కోసం సుదీర్ఘ కాలంపాటు విదేశాల్లో షూటింగ్ చేశారు. విదేశాల్లో షూటింగులకు నిర్మాతలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు నిర్మాణ ఖర్చులు తగ్గిపోతుండడమే అసలు సిసలైన రీజన్. వేరే ప్రాంతాల్లో షూటింగ్స్ కోసం ఒక్క సెట్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. పైగా అతి తేలికగా పర్మిషన్స్ దొరుకుతుంటాయి. అలాగే బ్రేకులు లేకుండా షూటింగ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. పైగా అతి కొద్ది మంది మెంబర్స్ తోనే షూటింగ్ చేసేయచ్చు కూడా అని చెబుతున్నారు.  

హైద్రాబాద్ లో కంటే ఇతర దేశాల్లో పర్మిషన్స్ తెచ్చుకోవడం చాలా తేలిక అంటున్నాడు నిన్ను కోరి నిర్మాత కోన వెంకట్. ఇక్కడైతే తన సొంత ఇంట్లో షూటింగ్ చేసుకునేందుకు కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి అంటున్నాడాయన. లోకల్ గా షూటింగ్ చేయాలంటే రోజుకు కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేయాలి. అలాగే పోలీసులు.. అధికారుల నుంచి పర్మిషన్స్ అంత తేలికైన విషయం కాదని అంటున్నారు అనిల్ సుంకర. విదేశాల్లో పలు ప్రాంతాల్లో షూటింగ్ చేసినందుకు.. ఖర్చుల్లో 20-30 శాతం వెనక్కు కూడా ఇచ్చేస్తుంటారు. నాన్నకు ప్రేమతో షూటింగ్ విషయంలో నిర్మాతకు భారీగానే వెనక్కు వచ్చింది. నిన్నుకోరి విషయంలో కూడా కొంత మొత్తం ఇలా క్యాష్ బ్యాక్ వచ్చిందట.

ఇతర దేశాల్లో షూటింగ్ చేసేటపుడు చాలా తక్కువ మందినే తీసుకెళ్తూ ఉంటారు. కానీ హైద్రాబాద్ లో షూటింగ్ స్పాట్ కు వచ్చేసరికి వందల మంది స్పాట్ లో కనిపిస్తూ ఉంటారు. అసలు ఇంతమంది ఎందుకో అర్ధం కాని విషయం అంటున్నాడు కోన వెంకట్. వందల మందికి సౌకర్యాలు కల్పించడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. పైగా ఆ ఈవెంట్స్.. ఈ పండుగలు అంటూ సెలవు అడిగే పరిస్థితి కూడా కనిపించదు. కొన్ని దేశాల్లో పగలు కాస్త ఎక్కువగా ఉంటుంది. అది కూడా షూటింగ్ కు అనుకూలమైన విషయమే.

శ్రీమంతుడు చిత్రంలో కొంత భాగాన్ని మలేషియాలో షూటింగ్ చేసినా.. ఆ తర్వాత అది హైద్రాబాద్ అనిపించేశారు. ఇప్పుడు మెగాస్టార్ 151వ మూవీ సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం విదేశీ షూటింగ్ ప్లాన్ చేశారట. ఉయ్యాలవాడ గ్రామం సెట్ ను పరాయి దేశంలో వేయనున్నారట. ఇక తమిళనాడులోని పొలాచ్చిలో కూడా ఎక్కువగానే షూటింగ్స్ జరుగుతుంటాయి. హైద్రాబాద్ లో కంటే ఇక్కడ ఓ 20-30శాతం ఖర్చులు తక్కువ అంటున్నారు నిర్మాతలు. హైద్రాబాద్ లో తప్ప ఎక్కడైనా సరే షూటింగ్ కి ఓకే అనేస్తున్నారు నిర్మాతలు.
Tags:    

Similar News