క్ర‌ష్ గురించి ఓపెన్ గా చెప్పిన టాప్-5 స్టార్స్

Update: 2022-11-20 08:30 GMT
య‌వ్వ‌నంలో తొలి క్ర‌ష్ ఎవ‌రికైనా చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. మ‌న‌సులో ఘాడంగా పాతుకుపోయే అంద‌మైన భావ‌న అది. టీనేజీలోనే కాదు అది న‌డివ‌య‌సులో కాస్త ఏజ్ బార్ అయ్యాక కూడా కొన‌సాగే ఒక వ్య‌వ‌స‌నం క్ర‌ష్ అంటే. అలాంటి తొలి క్ర‌ష్ గురించి బ‌హిరంగ వేదిక‌ల‌పై మ‌ట్లాడాల్సిందిగా స్టార్లపై ఒత్తిడి కూడా ఉంటుంది. తొలి క్ర‌ష్ కి సామాన్యులు మాన్యులు అనే తేడా ఏమీ లేదు. ముఖ్యంగా సినీవినీలాకాశంలో స్టార్ల న‌డుమ క్ర‌ష్ అనేది చాలా స‌హ‌జం .. చాలా మంది దీనిపై ఓపెన్ స్టేట్ మెంట్లు ఇస్తూ నిరంత‌రం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారుతుంటారు.

ఇంత‌కుముందు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న తొలి క్ర‌ష్ గురించి ఓపెనై అంద‌రికీ బిగ్ షాకిచ్చాడు. త‌న‌కు 80ల నాటి అందాల నాయిక ర‌వీనా టాండ‌న్ అంటే విప‌రీత‌మైన క్ర‌ష్ అంటూ ఓపెన‌య్యాడు. బాహుబ‌లి గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత ర‌వీనాను క‌లుసుకుని ఓ ప్ర‌చార‌ వేదిక‌పై డ్యాన్సులు కూడా చేశాడు. ఆ ఫోటోలు వీడియోలు ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. అలాగే  మైనే ప్యార్ కియా న‌టి భాగ్య‌శ్రీ రాధేశ్యామ్ చిత్రంలో న‌టించిన‌ప్పుడు త‌న‌పై ప్రేమాభిమానాన్ని కురిపించాడు. ప్ర‌స్తుతం నాగ్  అశ్విన్ ప్రాజెక్ట్ కేలో న‌టిస్తున్న దీపిక ప‌దుకొనే పైనా ప్ర‌భాస్ క్ర‌ష్ గురించి ఓపెన‌య్యాడు. అంత‌కుముందు సాహోలో న‌టించిన శ్ర‌ద్ధా క‌పూర్ పైనా డార్లింగ్ క్ర‌ష్ గురించి అభిమానుల్లో బోలెడంత చ‌ర్చ సాగింది.

ప్ర‌భాస్ త‌ర‌హాలోనే విక్కీ కౌశల్- స‌మంత‌- ఆలియా భ‌ట్- జాన్వీ క‌పూర్-అనన్య పాండే- కాజోల్ త‌దిత‌రులు త‌మ మొద‌టి క్ర‌ష్ గురించి బ‌హిరంగ వేదిక‌ల‌పై ప్ర‌క‌టించిన వారి జాబితాలో ఉన్నారు. తమ సెలబ్రిటీ క్రష్ ల గురించి బహిరంగంగా ఒప్పుకున్న టాప్ స్టార్స్ గురించి వివ‌రాల్లోకి వెళితే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిసాయి.

తారల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. వారి ల‌వ్ లైఫ్ బ్రేక‌ప్ స‌హా స‌హ‌జీవ‌నాల‌పైనా అంద‌రికీ ఆస‌క్తి. కానీ ఎవరు ఎవరిపై ప్రేమ కలిగి ఉన్నారో తెలుసుకోవడం అన్నివేళ‌లా సరదాగా ఉంటుంది. తాజాగా ఝలక్ దిఖ‌లాజా- 10 వేదిక‌పైకి విక్కీ కౌశల్ అతిథిగా వచ్చారు. అత‌డికి మొద‌టి క్ర‌ష్ గురించిన ప్ర‌శ్న ఎదురైంది. అత‌డు ఏమాత్రం త‌ట‌ప‌టాయించ‌కుండా 'మాధురీ దీక్షిత్' తన మొదటి క్రష్ అని వెల్లడించాడు.  సీనియ‌ర్ న‌టితో ముచ్చటగా డ్యాన్స్ కూడా చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

కార్తీక్ ఆర్యన్ పై సారా అలీ ఖాన్ ప్రేమ గురించి తెలిసిందే. కాఫీ విత్ కరణ్ లో సారా అలీ ఖాన్ కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు వెల్ల‌డించింది. కార్తీక్ తో క‌లిసి ఓ సినిమాలోను సారా న‌టించింది. అయితే ఈ ప్రేమకథకు ఫుల్ స్టాప్ ప‌డింద‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. కార్తీక్ ఆర్య‌న్ తో ప‌లువురు యువ‌క‌థానాయిక‌లు డేటింగ్ చేస్తున్నార‌ని వార్తలొచ్చాయి. ఇప్పుడు అత‌డు రోష‌న్ ల కుటుంబం నుంచి ఒక అంద‌మైన మోడల్ కం న‌టిని ప్రేమిస్తున్నాడ‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. సారా అలీఖాన్ త‌న డెబ్యూ చిత్ర క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తోను కొద్దిరోజుల పాటు డేటింగ్ చేసింది.

కింగ్ ఖాన్ షారూక్ వార‌సుడు ఆర్యన్ ఖాన్ పై అనన్య పాండే ప్రేమ వ్య‌వ‌హారం చాలాకాలంగా హాట్ టాపిక్. ఇటీవ‌ల 'కాఫీ విత్ కరణ్‌'లో అనన్య పాండే తన చిన్ననాటి స్నేహితుడు ఆర్యన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నాన‌ని పేర్కొంది. కానీ అన‌న్య‌కు దేవ‌ర‌కొండ అన్నా క్ర‌ష్ ఉంద‌న్న సంగ‌తి లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో బ‌య‌ట‌ప‌డింది. కార్తీక్ ఆర్య‌న్ పైనా త‌న మ‌న‌సు గురించి అన‌న్య ఎప్పుడూ దాచుకోలేదు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్ర‌స్తుతం బాలీవుడ్ లోను స్టార్ గా రాణించేందుకు ప‌క‌డ్భందీ ప్ర‌ణాళిక‌తో దూసుకెళుతోంది. త‌న మొద‌టి క్ర‌ష్ ఎవ‌రు? అన్న‌దానికి ఇంత‌కుముందు స‌మంత ఏదీ దాచుకోకుండా బ‌హిరంగంగా వెల్ల‌డించింది. బాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ పై త‌న తొలి క్ర‌ష్ గురించి సమంత రూత్ ప్రభు నిష్కల్మ‌షంగా ఓపెనైంది. కాఫీ విత్ కరణ్ 7లో ఈ ప్ర‌శ్న ఎదుర‌వ్వ‌గానే.. సమంతా రూత్ ప్రభు ఏమాత్రం త‌డుముకోకుండా జ‌వాబిచ్చింది. రణవీర్ సింగ్ పేరును ఓపెన్ గానే సూచించింది. ఇంత‌కుముందు ఈ జంట కలిసి ఓ ప్రకటనలో కనిపించారు. అక్కినేని నాగ‌చైతన్య‌తో స‌మంత ప్రేమాయ‌ణం పెళ్లి బ్రేక‌ప్ గురించి తెలిసిన‌దే.

గంగూభాయిగా.. ఆర్.ఆర్.ఆర్ సీతగా.. బ్ర‌హ్మాస్త్ర నాయిక‌గా వ‌రుస విజ‌యాలు అందుకున్న అలియా భట్ క్రష్ ఎవ‌రిపై? అంటే.. నిజానికి తాను డేటింగ్ ప్రారంభించక ముందే రణబీర్ కపూర్ పై క్రష్ ఉందని వెల్లడించింది. తనకు 11 ఏళ్ల వ‌య‌సు నుంచే అతడిపై క్రష్ ఉందని బాహాటంగా తెలిపింది. ర‌ణబీర్ తో ఆలియా సుదీర్ఘ ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. ఇటీవ‌లే పెళ్ల‌యింది. వీరికి ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. ఆలియాభ‌ట్ ఇంత‌కుముందు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో ప్రేమాయ‌ణం సాగించి బ్రేక‌ప్ కాగా... క‌త్రిన‌- దీపిక‌ల‌తో పాటు ప‌లువురు అందాల క‌థానాయిక‌ల‌తో ర‌ణ‌బీర్ డేటింగ్ వ్య‌వ‌హారాలు తెలిసిన క‌థే.

టాలీవుడ్ యువ‌క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండపై జాన్వీ కపూర్ ప్రేమను ఎప్పుడూ దాచుకోలేదు. ఇటీవ‌ల 'కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ కపూర్ అత‌డిపై క్ర‌ష్ గురించి ఓపెన్ గానే వెల్లడించింది. విజయ్ దేవరకొండపై తనకు ప్రేమ ఉందని... కానీ తన క్రష్ లు మారుతూనే ఉన్నాయని కూడా జాన్వీ నిర్మొహ‌మాటంగా చెప్పేసింది.

సీనియ‌ర్ న‌టి కాజోల్ కి ఇలాంటి ప్ర‌శ్న ఎదురైంది. క‌ల‌ర్స్ చానెల్ తాజా రియాలిటీ షోలో అక్షయ్ కుమార్ పై కాజోల్ కు తొలి క్ర‌ష్ (ప్రేమ) ఉందని కరణ్ జోహార్ వెల్లడించాడు. ఒక సరదా సెగ్మెంట్ లో KJo టాప్ సీక్రెట్ ని ఓపెన్ చేసాడు. అయితే కాజోల్ నవ్వుతూ అవును అది నిజ‌మేన‌ని తెలిపింది. కేవ‌లం వీళ్లు మాత్ర‌మే కాదు.. చాలామంది స్టార్లు సాటి తార‌ల‌పై క్ర‌ష్ గురించి ప‌లు సంద‌ర్భాల్లో ఓపెన‌య్యారు. ప్ర‌స్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 స్టార్ల తొలి క్ర‌ష్ గురించిన క‌థ‌న‌మిది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News