'బీస్ట్' ట్రైలర్: స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టిన విజయ్..!

Update: 2022-04-02 14:13 GMT
'మాస్టర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్‌ నటించిన లేటెస్ట్ మూవీ ''బీస్ట్'' (BEAST). 'డాక్టర్' ఫేమ్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే 'బీస్ట్' సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే 'అరబిక్ కుత్తు' 'జాలీఓ' పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుని సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

''బీస్ట్'' చిత్రాన్ని ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకుని సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు.

బీస్ట్ సినిమాని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందినచినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఇందులో స్పై ఏజెంట్ వీర్ రాఘవన్ పాత్రలో విజయ్ కనిపిస్తున్నారు. చెన్నైలోని ఓ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేయగా.. అదే మాల్ లో విజయ్ తో పాటుగా పూజా హెగ్డే కూడా ఉంటుంది.

విజయ్ ఉగ్రవాదులను ఎలా అంతమొందించాడు? మిషన్ ను ఎలా పూర్తి చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే 'బీస్ట్' సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఇందులో డైరెక్టర్ సెల్వరాఘవన్ - యోగిబాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్ లో హీరోయిన్ పూజా హెగ్డేకి ప్రాధాన్యత ఇవ్వలేదు.

యాక్షన్ సీన్స్ భారీ స్థాయిలో చాలా స్టైలిష్ గా డిజైన్ చేయబడ్డాయి. నెరిసిన గడ్డంతో విజయ్ కొత్తగా కనిపించాడు. చివర్లో 'నేను రాజకీయ నాయకుడిని కాదు.. సైనికుడిని' అనే డైలాగ్​ తో ట్రైలర్​ కు ముగించారు. దీనికి బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కళానిధి మారన్ సమర్పణలో సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో 'బీస్ట్' చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్. నిర్మల్ ఎడిటింగ్ వర్క్ చేసారు. ఫైట్ మాస్టర్స్ ద్వయం అన్బు-అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయగా.. జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.

'బీస్ట్' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే దీనికి పోటీగా ఏప్రిల్ 14న 'కేజీఎఫ్ 2' థియేటర్లలోకి వస్తోంది. మరి కన్నడ బాహుబలిని తట్టుకొని.. సక్సెస్ జోష్ లో ఉన్న హీరో విజయ్ - డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.




Full View




Tags:    

Similar News