బాలయ్య ఫ్యాన్సుకి రోహిత్‌ ట్రీట్‌

Update: 2016-03-29 08:03 GMT
భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలను, వాళ్లకు సంబంధించిన సీన్స్ ను.. కుర్ర హీరోలు ఉపయోగించుకోవడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ నందమూరి నటసింహం బాలకృష్ణను ఇలా ఉపయోగించుకోవడం మాత్రం గతంలో కనిపించేది కాదు. రీసెంట్ గా మాత్రం నాని ఇలాంటి ప్రయత్నం చేశాడు. కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంలో బాలయ్యకు అభిమానిగా నాని సందడి చేశాడు. చేతిపై జైబాలయ్య టాటూతో పాటు.. సినిమాలోనూ అనేక సన్నివేశాల్లో బాలయ్యను గుర్తు చేశాడు.

ఇప్పుడిలాంటి ప్రయత్నమే నారా రోహిత్ కూడా చేస్తున్నాడు. ఏప్రిల్ 1న విడుదల కానున్న సావిత్రి మూవీలో బాలయ్యపై ఏకంగా 20 నిమిషాల ఎపిసోడ్ ఉంటుందట. సావిత్రిలో బాలయ్యకు అభిమానిగా నారా రోహిత్ కనిపిస్తున్నాడో లేదో చెప్పకపోయినా.. ఈ స్పెషల్ ఎపిసోడ్ గురించి మాత్రం చెప్పాడు దర్శకుడు పవన్ సాదినేని. ఇంటర్వెల్ కు ముందు 20 నిమిషాల ఎపిసోడ్.. బాలయ్య అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయంగా చెబుతున్నారు.

ఒకవైపు బాలకృష్ణను ప్రశంసిస్తూనే మరోవైపు తమ సినిమా సక్సెస్ కోసం సావిత్రి యూనిట్ వేసిన ఈ స్కెచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. అది కూడా ఏకంగా 20 నిమిషాల ఎపిసోడ్ ఓ స్టార్ హీరోను మరిపించేలా తీయడమంటే సంథింగ్ స్పెషల్ అనాల్సిందే. మరి బాలయ్య అభిమానులను ఈ సీక్వెన్స్ ఎలా ఆకట్టుకుంటోందో తెలియాలంటే ఏప్రిల్ 1 వరకూ వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News