మెగాస్టార్ ఆ సీనియర్ హీరోయిన్ కి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా...?

Update: 2020-05-13 02:30 GMT
మెగాస్టార్ చిరంజీవి - త్రిష కాంబినేషన్ లో 14 ఏళ్ళ క్రితం 'స్టాలిన్' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ జోడీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కొరటాల దర్శకత్వంలో రాబోతున్న 'ఆచార్య'లో కలిసి నటించే అవకాశం వచ్చింది. అయితే త్రిష ఈ సినిమా నుండి తప్పుకొని అందరిని షాక్ కి గురి చేసింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసారు చిత్ర యూనిట్. అయితే ఈ మధ్య మెగాస్టార్ ఒక ఇంటర్వ్యూలో త్రిష తప్పుకోవడం గురించి మాట్లాడుతూ.. 'ఆచార్య' నుంచి తప్పుకోడానికి కారణం మణిరత్నం సినిమాకి ఆల్రెడీ డేట్స్ కేటాయించడమేనని.. రెండు సినిమాలకి డేట్స్ క్లాష్ అవుతాయని సినిమాను వదిలేసుకుందని చెప్పాడు. ఇలా ఇద్దరూ పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. మెగాస్టార్ సినిమాని వదిలేసిందని త్రిష మీద మెగా ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో త్రిష బర్త్ డే నాడు ఆమెకి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పి వీరి మధ్య దూరం పోగొట్టాడు. 'నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని.. విజయం నిన్ను వరించాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి' అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా 'థాంక్యూ టు స్వీటెస్ట్ లెజెండ్' అని త్రిష రిప్లై ఇచ్చారు. దీంతో వీరి మధ్య అపోహలు ఏమీ లేవనే ఒక అభిప్రాయానికి వచ్చారు సినీ అభిమానులు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి మళ్ళీ నటించే అవకాశాలున్నాయంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ వరుస సినిమాలలో నటిస్తూ వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్న చిరు ఆ తర్వాత బాబీ (కేయస్ రవీంద్ర) మరియు మెహర్ రమేష్ లతో సినిమాలు ఉండబోతున్నాయని ప్రకటించాడు. అంతేకాకుండా పూరీ జగన్నాథ్ మరియు హరీష్ శంకర్ లతో కూడా డిస్కషన్ జరుగున్నాయని సమాచారం.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ - త్రిష కాంబోలో ఖచ్చితంగా సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే 'ఆచార్య' సినిమా తర్వాత చేయబోయే 'లూసిఫర్' సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండదు. కానీ మెగాస్టార్ ని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ సుజిత్ మార్పులు చేస్తున్నాడని సమాచారం. ఆయన మార్పుల్లో హీరోయిన్ క్యారెక్టర్ పెడితే దాని కోసం త్రిషని తీసుకుంటారేమో చూడాలి. ఈ సినిమా కాకపోయినా బాబీ లేదా మెహర్ రమేష్ సినిమాల్లో త్రిష ని తీసుకొవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న ఆ నాలుగురు ఐదుగురితో హీరోయిన్స్ తో నటించాల్సిన పరిస్థితి. అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం చిరు - త్రిష కాంబోపై ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం ఆమె 'ఆచార్య' నుండి అర్థాంతరంగా తప్పుకోవడమే. మరికొందరు మెగా అభిమానులు మాత్రం 'స్టాలిన్' జోడీ మరోసారి వెండితెరపై అలరిస్తే చూడాలని ఆశ పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News