శ్యామ్‌ సింగరాయ్‌ కోసం ఇద్దరు స్టార్‌ హీరోల పోటీ

Update: 2022-03-03 06:30 GMT
నాని హీరోగా సాయి పల్లవి మరియు కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించిన శ్యామ్‌ సింగరాయ్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు రాహుల్ సంకీర్త్యన్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. సినిమా కరోనా పరిస్థితుల నడుమ విడుదల అయ్యి కూడా మంచి వసూళ్లు దక్కించుకుంది. ఈ సినిమాను హిందీలో డబ్‌ చేసి భారీ ఎత్తున విడుదల చేయాలని భావించారు.

కాని శ్యామ్‌ సింగరాయ్ సినిమాను డబ్బింగ్‌ చేసి విడుదల చేయడం కంటే రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంకు మేకర్స్ వచ్చారు. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతలు సైతం శ్యామ్‌ సింగ రాయ్‌ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. ఎట్టకేలకు శ్యామ్‌ సింగ రాయ్ సినిమా హిందీ రీమేక్‌ కు సంబంధించిన చర్చలు తుది దశకు వచ్చాయి. బాలీవుడ్‌ దర్శకుడు ఈ సినిమా రీమేక్ ను చేయబోతున్నాడట.

ఈ రీమేక్ కోసం బాలీవుడ్‌ కు చెందిన ఇద్దరు హీరోల పేర్లు పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. వారు ఇద్దరు కూడా ఈ రీమేక్ పై చాలా ఆసక్తిగా ఉన్నారట. కాని ఎవరి డేట్లు కుదురుతాయి అనేది తేల్చి ఆ తర్వాత  ఒకరిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అజయ్‌ దేవగన్ మరియు షాహిద్‌ కపూర్ లు ఆ జాబితాలో ఉన్నారు. తెలుగు సినిమాలను రీమేక్ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెల్సిందే.

అందుకే ఆ ఇద్దరు కూడా శ్యామ్‌ సింగ రాయ్ సినిమా కోసం పోటీ పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. నాని పాత్రను హిందీలో షాహిద్‌ కపూర్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. నాని నటించిన జెర్సీ సినిమా రీమేక్ కు మంచి రెస్పాన్స్‌ ఉంది. ఇంకా విడుదల కాకుండానే జెర్సీ సినిమా సూపర్‌ హిట్‌ అన్నట్లుగా హిందీ ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో శ్యామ్‌ సింగ రాయ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

శ్యామ్‌ సింగరాయ్ సినిమా పూర్వ జన్మల నేపథ్యంలో కథ సాగుతోంది. సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. శ్యామ్ సింగ రాయ్ ఒక రచయిత. ఆయన మళ్లీ ఈ కాలంలో జన్మించడం.. ఆయన రచనలు మళ్లీ వెలుగులోకి రావడం జరుగుతుంది. పూర్వ జన్మ గుర్తుకు వచ్చిన హీరో ఆ జన్మలో తన భార్య కోసం వెళ్లడం కూడా ఆసక్తికరంగా చూపించారు. దర్శకుడు ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ ను చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు. అందుకే ఈ సినిమా హిందీలో తప్పకుండా రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉందంటున్నారు.

Tags:    

Similar News