‘ఫైర్ ఈజ్ ద ఫైర్.. బాలయ్య ఈజ్ ద ఫైర్’ అని అగ్రహీరో నందమూరి బాలక్రిష్ణ మీద అందరూ ఆడిపోసుకునే వారే.. తండ్రి ఎన్టీఆర్ ఎంతో గొప్ప చరిత్రకారుడిగా నిలిస్తే ఆయన వారసుడు బాలక్రిష్ణలోని ఆవేశపరుడినే ఇప్పటిదాకా అందరూ చూశారు. కానీ ఆయనలో మరో యాంగిల్ కూడా ఉంది అంటోంది అలనాటి మేటి తార జమున..
బాలయ్య ఇటీవల టాలీవుడ్ సినీ పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దానికి మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం టాలీవుడ్ ను చుట్టుముట్టింది. సోషల్ మీడియాలో అయితే యుద్ధమే జరుగుతోంది.
అయితే బాలయ్యలో ఫైర్ యాంగిలే కాదు.. ఆయన తండ్రి నుంచి వచ్చిన మంచి మనస్తత్వం ఉందని జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నాడు ఎన్టీఆర్ షూటింగ్ లో ప్రొడక్షన్ బాయ్, టీ, కాఫీలు అందించే వారిని, లైట్ బాయ్ లను కూడా ఎంతో గౌరవంతో మీరు అని పిలిచేవారని.. పెద్దవాళ్లను ఎంతో గౌరవించేవారని.. బాలయ్య కూడా పెద్దవారిని అమితంగా గౌరవిస్తాడని జమున తెలిపింది.
తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఫోన్ చేసి ‘అమ్మా ఎలా ఉన్నారు’ అని యోగక్షేమాలన్నీ అడిగారని.. నన్ను ఒక తల్లిలా గౌరవిస్తారని.. బాలయ్యకి పెద్దలంటే మర్యాద అని జమున గుర్తు చేశారు. దీన్ని బట్టి ఆవేశమే కాదు.. బాలయ్యలో ఈ కొత్త కోణం కూడా ఉందని జమున మాటలను బట్టి తెలుస్తోంది.