‘బిచ్చగాడు’ కాబోతున్న అర్జున్ రెడ్డి?

Update: 2017-09-15 05:24 GMT
రెండు మూడు వారాలుగా టాలీవుడ్లో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ గురించే చర్చ. ఇంతకుముందే రెండు మూడు సినిమాలు చేసినా.. వాటితో మంచి పేరే సంపాదించినా.. ‘అర్జున్ రెడ్డి’తో అతను సంపాదించిన పేరు అలాంటిలాంటిది కాదు. ఆ సినిమాతో అతడి రేంజే మారిపోయింది. యువతలో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకుని చిన్న స్థాయి స్టార్ అయిపోయాడు విజయ్. ఈ ఇమేజ్ ను.. ఈ పేరును ఏమాత్రం నిలబెట్టుకుంటాడన్నది ఆసక్తికరం. ప్రస్తుతానికి అతడి చేతిలో అరడజను దాకా సినిమాలుండటం విశేషం. తెలుగులో అతడికి ఇప్పుడున్న కమిట్మెంట్లను పూర్తి చేయడానికే దాదాపు రెండేళ్లు సమయం పట్టొచ్చేమో.

కానీ విజయ్ అప్పుడే పొరుగు భాషలోనూ ఫాలోయింగ్ పెంచుకునే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అతను కన్నడలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. ఇందుకోసం ‘బిచ్చగాడు’ రీమేక్ మీద దృష్టిపెట్టాడంటున్నారు. ఓ ప్రముఖ కన్నడ నిర్మాత అతడితో ‘బిచ్చగాడు’ రీమేక్ ను నిర్మించడానికి ముందుకొచ్చినట్లు చెబుతున్నారు. పుట్టపర్తిలో చదువుకోవడం వల్ల విజయ్ కి కన్నడ మీద మంచి పట్టే ఉంది. ఈ నేపథ్యంలో నేరుగా కన్నడ సినిమా చేయాలని చూస్తున్నాడట విజయ్. ఐతే విజయ్ ది సరైన ఆలోచనేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. తమిళనాటో.. కేరళలోనో ఫాలోయింగ్ పెంచుకుంటే.. అక్కడి ప్రేక్షకుల్ని డబ్బింగ్ సినిమాలతో పలకరించవచ్చు. ప్రతి సినిమానూ అనువాదం చేసుకోవచ్చు. అదనంగా ఆర్జించవచ్చు. కానీ కర్ణాటకలో ఆ పరిస్థితి లేదు. అక్కడ డబ్బింగ్ సినిమాలపై నిషేధం ఉంది. అలాంటపుడు విజయ్ ఏం సాధిస్తాడన్నది సందేహం. పైగా తెలుగులో ఇన్ని కమిట్మెంట్లుండగా.. కన్నడలో ట్రై చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరి విజయ్ ఆలోచన ఎలా ఉందో?
Tags:    

Similar News