ఆ డైరెక్టర్ కి కోపం వస్తే అంతే సంగతులు: సీనియర్ హీరో

Update: 2022-03-02 23:30 GMT
టాలీవుడ్ తెరపై రాణించిన పొడగరి హీరోల్లో వినోద్ కుమార్ ఒకరు. తెలుగులో గట్టిపోటీ ఉన్నప్పటికీ ఆయన తట్టుకుని నిలబడ్డారు. 'మౌన పోరాటం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆయన, ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. 'మామగారు' .. 'సీతారత్నం గారి అబ్బాయి' .. 'భారత్ బంద్' వంటి సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో కనిపిస్తాయి. ఇంతవరకూ ఆయన 160 సినిమాలు చేయగా, అందులో 110 తెలుగు సినిమాలే. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గురించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

"నేను ముంబైలో ఒక హోటల్లో రిసెప్షన్ లో పని చేస్తుండగా అక్కడికి ఒక సినిమా పని మీద కన్నడ నిర్మాత వచ్చారు. అక్కడ ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన నన్ను సినిమాల్లో యాక్ట్ చేయమని అడిగారు. నాకు యాక్టింగ్ రాదు .. హీరోను కావాలనే ఆసక్తి లేదు అని చెప్పాను. కానీ ఆయన వినిపించుకోలేదు.

బెంగుళూర్ వెళ్లిన తరువాత కొన్ని నెలలకి నాకు కబురు చేశారు. నేను వెళ్లి ఆయనను కలుసుకున్నాను. ఆయన ఒక కన్నడ సినిమా కోసం నన్ను హీరోగా తీసుకున్నారు. ఆ ఒక్క సినిమా చేసి చూద్దామని అనుకున్నాను. అది సూపర్ హిట్ అయింది.

ఫస్టు సినిమాకి నేను అందుకున్న పారితోషికం 9 వేలు. ఆ తరువాత నుంచి నాకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. ఆ సమయంలో తెలుగులో 'మౌన పోరాటం' సినిమా కోసం కొత్త హీరోను వెదుకుతున్నారు. అట్లూరి రామారావుగారు నా సినిమా చూసి నన్ను పిలిపించారు. అలా తెలుగులో ఆ సినిమాతో నా పరిచయం జరిగింది. ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధించిందనేది అందరికీ తెలిసిందే. మోహన్ గాంధీ గారి దర్శకత్వంలో 5 సినిమాలు చేశాను. ఆర్టిస్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఒక్క సినిమా అయినా ఆయనతో చేయాలి. అప్పుడు వర్క్ ఎలా ఉండాలనే విషయం తెలుస్తుంది.

మోహన్ గాంధీ గారికి కావాల్సింది పెర్ఫెక్షన్. లేదంటే వెంటనే ఆయనకి కోపం వచ్చేసేది. చేతిలో ఉన్న ఫైల్ విసిరికొట్టేవారు. అందువలన ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది. ఇక దాసరి నారాయణరావు గారు .. కోడి రామకృష్ణగారితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తుంటాను. దాసరిగారు అంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ, ఇతర దర్శకుల సినిమాల్లో నటిస్తున్నప్పుడు దర్శకుడి పనిలో ఎంతమాత్రం జోక్యం చేసుకునేవారు కాదు.

ఆయనతో నేను చేసిన 'మామగారు' సినిమానే అందుకు ఉదాహరణ. అలాంటి ఆయనతో కలిసి నటించే అవకాశం .. అదృష్టం అందరికీ రాదు" అని చెప్పుకొచ్చాడు.          
   
Tags:    

Similar News