హిందీ మార్కెట్ లో 'భీమ్లా నాయక్' పరిస్థితేంటి..?

Update: 2022-02-18 06:30 GMT
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఈ నెల 25వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ మీద క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. షూటింగ్ పూర్తవడంతో మరోసారి రిలీజ్ డేట్‌ పోస్టర్ వదిలి అందరి సందేహాలను నివృత్తి చేసారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా హిందీలోనూ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు.

ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలందరూ నార్త్ మార్కెట్ మీద దృష్టి పెడుతున్నారు. యూట్యూబ్ లో తమ సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి హిందీలోనూ థియేట్రికల్ రిలీజ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కంటెంట్ యావరేజ్‌ గా ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు థియేటర్లలో అనూహ్యంగా మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. దీనికి కారణం భారీ ప్రమోషన్లు మరియు నటీనటులు సినిమాను మార్కెట్ చేస్తున్న తీరు అని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం లేదు. వారిని థియేటర్లకు రప్పించడానికి పోస్టర్స్ సరిపోతాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. టీజర్స్ మరియు పాటలు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇక మిగిలిన థియేట్రికల్ ట్రైలర్ వదిలి.. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ. కాకపోతే హిందీ మార్కెట్ లో పరిస్థితేంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది.

గతంలో 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ స్వయంగా రంగంలోకి దిగి బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చినా.. ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీలోనూ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత అగ్ర హీరో మళ్ళీ బాలీవుడ్ వైపు అడుగులు వేయలేదు. ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమాతో మరోసారి నార్త్ మార్కెట్ ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు.

అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్‌ లో భారీ హిట్ అయినందున..  ప్రమోషన్లు లేకపోయినా ఇటీవల వచ్చిన 'పుష్ప' బాలీవుడ్ లో బాగా వసూలు చేసింది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాదు. అక్కడ మంచి ఓపెనింగ్స్ రావాలంటే సినిమాని బాగా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. పవన్ ఈ సినిమాను హిందీలో ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నారా అంటే చెప్పలేని పరిస్థితి.

ఎందుకంటే సర్ధార్ సమయంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగలేదు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ అధినేతగా ఓవైపు పాలిటిక్స్ కూడా చేస్తున్నారు. అందుకే పవన్ నుంచి హిందీ ప్రమోషన్స్ ఎక్సపెక్ట్ చేయలేమని సినీ అభిమానులు అంటున్నారు. కాకపోతే కనీసం ఒక ఇంటర్వ్యూ రికార్డ్ చేసి బాలీవుడ్ మీడియాకి వదిలినా చాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రమోషన్స్ చేయని 'ఖిలాడీ' సినిమాకి నార్త్ మార్కెట్ లో ఎలాంటి దెబ్బ పడిందో మనం చూసాం. మరి వచ్చే వారం రాబోయే 'బీమ్లా నాయక్' సినిమా సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాని యూఎస్‌ లో 400 పైగా థియేటర్స్‌ లలో రిలీజ్ చేస్తున్నారు. ప్రీ బుకింగ్ సేల్స్ చూస్తుంటే ఓవర్ సీస్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటుందనిపిస్తోంది.

'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు.
Tags:    

Similar News