ఆర్జీవీ చెప్పింది నిజమే కదా..?

Update: 2022-04-18 03:58 GMT
స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ సినిమా సినిమాకీ రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల కాలంలో మన టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు ఓ రేంజ్ లో పెరిగాయి. ఇప్పుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుండటంతో టాలీవుడ్ స్థాయి పెరిగింది. అలాని క్రేజ్ కు తగ్గట్టుగా హీరోల రెమ్యునరేషన్స్ కూడా రెట్టింపు అయ్యాయి.

సినిమాలు విజయం సాధించినప్పుడు ఇవేమీ ఎవరూ పట్టించుకోరు. కానీ మూవీ ప్లాప్ అయినప్పుడు అన్నీ లెక్కకు వస్తాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు పరాజయం పొందినప్పుడు.. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన సినిమాలు భారీ సక్సెస్ సాధించినప్పుడు హీరోల పారితోషికాలపై చర్చ జరుగుతూ ఉంటుంది.

ఇటీవల 'కేజీయఫ్: చాప్టర్ 2' సినిమా సక్సెస్ ని స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ తో ముడిపెడుతూ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. హీరోలకు భారీ పారితోషికాలు ఇస్తూ డబ్బు వృధా చేయకుండా.. దాన్ని మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మంచి సినిమాలు వస్తాయని ఆర్జీవీ పేర్కొన్నారు.

''స్టార్ హీరోల రెమ్యూనరేషన్ల కోసం డబ్బును వృధా చేయకుండా.. మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మరింత నాణ్యమైన సినిమాలు.. బిగ్గెస్ట్ హిట్లు వస్తాయి అనడానికి 'కేజీఎఫ్ 2' మాన్ స్టర్ హిట్టే స్పష్టమైన నిదర్శనం'' అని వర్మ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ద్వారా అత్యధిక పారితోషికాలు తీసుకునే స్టార్ హీరోలపై ఆర్జీవీ పరోక్షంగా సెటైర్ వేశారని అర్థం అవుతోంది. హీరోలకు భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి బడ్జెట్ పెంచుకోకుండా.. అదే మొత్తాన్ని సినిమా మేకింగ్ పై పెడితే మంచి క్వాలిటీ చిత్రాలు బయటకు వస్తాయనేది ఆయన అభిప్రాయం. రామ్ గోపాల్ వర్మ చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు.

ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చితే.. లో బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి. స్టార్స్ ని నమ్ముకొని చేసిన సినిమాలైతే డిజాస్టర్స్ గా మిగిలాయి. అధిక బడ్జెట్ కారణంగా మరికొన్ని చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టలేకపోయాయి.

అందుకే స్టార్ల రెమ్యునరేషన్స్ తగ్గించడం ద్వారా బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకోవాలని.. అలాంటప్పుడు ఒకవేళ సినిమా ప్లాప్ అయినా భారీ నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఉండదని అనుకోవచ్చు. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్స్ మాత్రమే అధికంగా ఉండేవి. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక టాలీవుడ్ హీరోల పారితోషికాలు బాగా పెరిగాయి. కోలీవుడ్ లో కూడా అదే పరిస్థితి.

అయితే వీటితో పోల్చుకుంటే కన్నడ - మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోల రెమ్యునరేషన్స్ కాస్త తక్కువనే చెప్పాలి. అక్కడ చాలా సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. అందుకే ఇప్పటినుంచైనా ఫిలిం మేకర్స్ హీరోల రెమ్యునరేషన్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా.. కంటెంట్ - మేకింగ్ మీద దృష్టి పెడితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News