ఆర్ ఆర్ ఆర్ విడుదల ఎప్పుడు...?

Update: 2019-10-14 11:18 GMT
దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది పట్టించుకోరు అభిమానులు. రాజమౌళి సినిమా అనే బ్రాండ్ అతని సినిమాలకు క్రేజ్ తీసుకొస్తుంది. అంతలా అభిమానులపై అతని ప్రభావం ఉంటుంది. కానీ రాజమౌళి ఒక సినిమా అనౌన్స్ చేశాడంటే అది రెండు మూడు సంవత్సరాలకు కానీ రిలీజ్ అవ్వదు. అంతలా అతను సినిమాలను చెక్కుతాడు. అందుకే రాజీవ్ కనకాల లాంటి వాళ్ళు అతనిని జక్కన్న అని ముద్దుగా పిలుస్తారు. అతను చేసే సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ చేయడని రాజమౌళికి ఒక పేరుంది. కానీ ఎంత లేట్ అయినా అతని సినిమాల కోసం జనాలు ఆతృతగా ఎదురుచూస్తారు.

బాహుబలి సినిమాల భారీ విజయాల తర్వాత రాజమౌళి ఎన్టీఆర్, రాంచరణ్ లతో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం ఈ ఇద్దరు హీరోలతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టిన జక్కన్న ఈ సినిమాను 2020 జులై 30న విడుదల చేస్తామని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే వాళ్ళు చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ చేయడం కష్టమయ్యేలా ఉంది. హీరోలు ఇద్దరికీ గాయాలయ్యి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. తర్వాత రాంచరణ్ 'సైరా' మూవీ ప్రమోషన్స్ కోసం కొద్దిరోజులు ఈ సినిమాకు దూరంగా ఉన్నాడు. ఇన్ని ఆటంకాలు ఎదుర్కొని అనుకున్న సమయానికి విడుదల చేయడం రాజమౌళికి కత్తి మీద సాము లాంటిదే. ఈ సినిమా 2020 దసరాకి వస్తుందని కొందరు, 2021 సంక్రాంతికి వస్తుందని మరికొందరు అనుకుంటున్నారు. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Tags:    

Similar News