ఈసారి ఏ మారణహోమాన్ని తెరపై ఆవిష్కరిస్తారు..?

Update: 2022-04-19 05:37 GMT
వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం పై 'ది తాష్కెంట్ ఫైల్స్' అనే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలతో జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు.

ఈ క్రమంలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో వచ్చిన "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. 1990లో కశ్మీర్ లోయలో జరిగిన దారుణ అకృత్యాలను.. కాశ్మీర్ పండిట్ల హృదయాన్ని కదిలించే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

అయితే 'ది కాశ్మీర్ ఫైల్స్' సక్సెస్ తర్వాత దర్శకనిర్మాతలు ''ది ఢిల్లీ ఫైల్స్'' అనే మరో వైవిధ్యమైన చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. తాను కొత్త సినిమాకు పని చేయాల్సిన సమయం వచ్చిందని దర్శకుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఢిల్లీ ఫైల్స్ స్టోరీ గురించి వివేక్ అగ్నిహోత్రి వెల్లడించనప్పటికీ.. ఈ చిత్రం న్యూఢిల్లీలో జరిగిన 1984 సిక్కుల ఊచకోత నేపథ్యంలో వుంటుందని టాక్ వినిపిస్తోంది. 1984 అక్టోబరు 31న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి.

ఇందిరా ను ఆమె సిక్ బాడీ గార్డ్ హత్య చేయడంతో సిక్కులకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ అల్లర్లలో 3500 మంది సిక్కులు చనిపోయారని అధికారికంగా చెప్పబడింది. కానీ అనధికారికంగా 8000 - 17000 మంది చనిపోయి ఉంటారని నివేదికలు వెల్లడించాయి.

అలాంటి క్రూరమైన మారణహోమం వెనుక ఉన్న చీకటి రహస్యాలను ఛేదించాలని వివేక్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఓ సిక్ బాలుడిని చూపించడాన్ని బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

'ది కాశ్మీర్ ఫైల్స్' లో న్యాయ హక్కు గురించి చూపించగా.. ఇప్పుడు 'ఢిల్లీ ఫైల్స్' చిత్రంలో జీవించే హక్కు గురించి చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ - ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందనుంది. అభిషేక్‌ అగర్వాల్‌ - అర్చన అగర్వాల్ - వివేక్ అగ్నిహోత్రి - పల్లవి జోషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Tags:    

Similar News