ఫోక‌స్‌: క్రిష్‌.. బాలా .. ఎవ‌రు కరెక్ట్?

Update: 2019-02-10 06:21 GMT
సినిమా నిర్మాణం అనేది ఎంతో ఎమోష‌న్ తో కూడుకున్న‌ది. కోట్లాది రూపాయ‌ల‌ రిస్క్ తో ముడిప‌డిన అంశమిది. అందుకే ఒక సినిమా ప్రారంభ‌మై, ముగిసే లోపు ఎన్ని గొడ‌వ‌లైనా జ‌రిగేందుకు ఆస్కారం ఉంది. ఆ గొడవ‌లు ర‌క‌ర‌కాలుగా ఉంటాయి. కొన్నిసార్లు క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ చాలా ఇబ్బందిక‌రంగానూ మారుతున్నాయి. అయితే అలా అవ్వ‌కుండా సినిమా తీస్తే ఆ ప్రాజెక్టు కోసం పని చేసిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోల మ‌ధ్య స‌ఖ్య‌త ఆ స్థాయిలో ఉంద‌ని విశ్లేషించ‌వ‌చ్చు. మ‌ణిక‌ర్ణిక‌, వ‌ర్మ సినిమాల విష‌యంలో డిఫ‌రెన్సెస్ గురించి ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇటీవ‌లే రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన `మ‌ణిక‌ర్ణిక` విష‌యంలో కంగ‌న‌తో క్రిష్ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ గురించి తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో కంగ‌న ఫింగ‌రింగ్ పై నెటిజ‌నుల్లో ఆస‌క్తిక‌ర డిబేట్ న‌డిచింది. దాదాపు 70 శాతం సినిమా పూర్తి చేసిన క్రిష్ చివ‌రిలో ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డంతో బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ‌ను క్వీన్ కంగ‌న పూర్తి చేశారు. మ‌ణిక‌ర్ణిక  రిలీజ్ త‌ర్వాత ఆ సినిమా ఘ‌న‌విజ‌యంలో క్రిష్ పాత్ర ఏమీ లేద‌ని కంగ‌న క‌ల‌రింగ్ ఇవ్వ‌డం, అటుపై జోరుగా కామెంట్లు చేయ‌డంపైనా ఇంకా ఆస‌క్తిగానే మాట్లాడుకుంటున్నారు.

ఈ వివాదం ఇంకా వేడెక్కిస్తుండ‌గానే.. కోలీవుడ్ లో ఈ త‌ర‌హాలోనే మ‌రో వివాదం తెర‌పైకొచ్చింది. చియాన్ విక్ర‌మ్ న‌ట‌వార‌సుడు ధృవ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ జాతీయ అవార్డు ద‌ర్శ‌కుడు బాలా `అర్జున్ రెడ్డి` రీమేక్ ని తెర‌కెక్కిస్తున్నారు. వ‌ర్మ అనేది టైటిల్. ఈ4 ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా మొత్తం పూర్త‌య్యాక అస‌లు బాలా స‌రిగా తీయ‌లేదు.. ఇదో స్క్రాప్ అంటూ నిర్మాత‌లు తీసిపారేయ‌డంతో వివాదం రాజుకుంది. అయితే మ‌ణిక‌ర్ణిక వివాదానికి దీనికి పోలిక లేదు. అక్క‌డ కంగ‌న‌, క్రిష్ మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వేరు. ఇక్క‌డ డిఫ‌రెన్సెస్ వేరు. `వ‌ర్మ` చిత్రాన్ని 100శాతం పూర్తి చేశాక స్క్రాప్ లో వేస్తున్నామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. పైగా ఈ చిత్రాన్ని తిరిగి వేరొక ద‌ర్శ‌కుడితో నిర్మిస్తామ‌ని ఆవేశంగా ప్ర‌క‌టించడంతో మ‌న‌స్థాపం చెందిన బాలా మీడియాకు ఓ బ‌హిరంగ లేఖ‌ను రాశారు. విక్ర‌మ్ కుమారుడు ధృవ్ కెరీర్ బావుండాల‌ని తాను ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని బాలా చాలా స్ప‌ష్టంగా అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో బాలా కంటే నిర్మాత‌ల‌కే నెటిజ‌నుల నుంచి అక్షింత‌లు ఎక్కువ‌గా ప‌డుతున్నాయి.

వంద శాతం సినిమా పూర్తి చేసి తొలి కాపీ వ‌చ్చాక‌.. క్రియేటివిటీ ప‌రమైన విభేదాలు రాకుండా ఇప్పుడు స్క్రాప్ అంటే ఎలా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇక మ‌ణిక‌ర్ణిక విష‌యంలో 70 శాతం పూర్తి చేసి మ‌ధ్య‌లోనే వ‌చ్చేసిన క్రిష్ ఆ విష‌యాన్ని రిలీజ్ అయ్యే వ‌ర‌కూ దాచి పెట్టారు. రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాక బ‌య‌ట‌పెట్టినా లాభం లేకుండా పోయింది. త‌న‌కు ద‌క్కాల్సిన క్రెడిట్ ని పూర్తిగా కంగ‌న తన‌ప‌రం చేసుకున్న త‌ర్వాత మీడియా ముందు ఓపెన్ అయినా ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింది. ఓ ర‌కంగా క్రిష్ త‌ప్పు చేశాడ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. వ‌ర్మ‌ విష‌యంలో బాలాతో నిర్మాత‌ల‌ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ విష‌యంలో బాలా పూర్తి క్లారిటీతో వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో అత‌డి త‌ప్పేమీ లేద‌న్న వాద‌నా వినిపిస్తోంది. ప్రాజెక్టు నుంచి త‌న‌కు తానుగానే త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌టించిన బాలా.. ఓపెన్ లెట‌ర్ రాయ‌డంతో అత‌డివైపే సింప‌థీ ఉందిప్పుడు. ఈ త‌ర‌హా వివాదాలు ఇప్పుడే కొత్తేమీ కాదు. గ‌తంలో `స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్` విష‌యంలోనూ బాబితో.. ప‌వ‌న్ కి చిన్న పాటి క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయ‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఆ త‌ర్వాత స‌ర్ధుబాటు చేసుకుని సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు. అంత‌కుముందు టాలీవుడ్ లో ఈ త‌ర‌హా ఎన్నో వివాదాలు న‌డిచాయి. డ‌బ్బును వెద‌జ‌ల్లాక సినిమా స‌రిగా రాలేదంటే నిర్మాత‌లు ఎమోష‌న‌ల్ గా కంట్రోల్ అవ్వ‌డం అన్న‌ది క‌ష్ట‌మే. అయితే ఆ జాగ్ర‌త్త కాస్త ముందుగా ఉంటేనే మంచిద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.
    

Tags:    

Similar News