#RC15 లో బాలీవుడ్ స్టార్ ఎవ‌రై ఉంటారు?

Update: 2021-07-06 03:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ కెరీర్ కి 15వ చిత్రం కావ‌డంతో ల్యాండ్ మార్క్ చిత్రంలా నిలిచిపోయేలా శంక‌ర్-దిల్ రాజు వ‌ర్గాలు భారీత‌నంతో ప్లాన్ చేస్తున్నారు. యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా కేట‌గిరీలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఓ ఐపీఎస్ అధికారి రాజ‌కీయ నాయ‌కుడిగా మారితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ ని ట‌చ్ చేస్తూ శంక‌ర్ భార‌తీయుడు- ఒకే ఒక్క‌డు త‌ర‌హాలో ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది. ఇండియాలో రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌పైనే శంక‌ర్ మ‌రోసారి స‌మ‌రశంఖం పూరించిన‌ట్లే క‌నిపిస్తోంది.

స‌మాజాన్ని.. వ్య‌వ‌స్థ‌ల్ని  ప్ర‌శ్నిస్తూ గ‌తంలో శంక‌ర్ తెర‌కెక్కించిన `భార‌తీయుడు`- `అప‌రిచితుడు`.. `ఒకే ఒక్క‌డు` చిత్రాలు ఎలాంటి సంచ‌ల‌నాలు న‌మోదు చేసాయో తెలిసిందే. ఇప్పుడు చ‌ర‌ణ్ తోనూ ఆ రేంజ్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఆర్‌.సి 15 సినిమాకి సంబంధించిన అప్ డేట్ రివీల్ అయింది. సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ కి ప్లాన్ రెడీ అవుతోంది. 2022 ద్వితియార్థానికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాల‌ని శంక‌ర్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇందులో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో సూప‌ర్ స్టార్ నే రంగంలోకి దించ‌డానికి శంక‌ర్ టీమ్ ప్లాన్ చేస్తోందని క‌థ‌నాలొస్తున్నాయి. ఆ పాత్ర‌పై చిత్రీక‌ర‌ణ దాదాపు 30 రోజులు ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. అప‌రిచితుడులో నీల్ నితిన్ పాత్ర  త‌ర‌హాలో ఈ రోల్ ఉంటుంద‌ని తెలిసింది. భారీ కాస్టింగ్ తో ఆర్.సీ 15 అంత‌కంత‌కు హీట్ పెంచ‌నుంది.

ఇక `ఇండియ‌న్-2`పై నెల‌కొన్న వివాదాల నేప‌థ్యంలో చెన్నై కోర్టు కూడా శంక‌ర్ కి ఊర‌ట కల్గించే తీర్పునిచ్చింది. కానీ తాజా అప్ డేట్ ప్ర‌కారం.. ప్ర‌స్తుతానికి వివాదాస్ప‌ద సినిమాని ప‌క్క‌న‌బెట్టి చ‌ర‌ణ్ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తిని చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  అలాగే ఈ సినిమా త‌ర్వాత బాలీవుడ్ లో `అప‌రిచితుడు` రీమేక్ తెర‌కెక్కించ‌నున్నారు.
Tags:    

Similar News