టికెట్ ర‌గ‌డ‌: మోహ‌న్ బాబుతో రాయ‌బేరం కుదురేనా?

Update: 2022-01-02 11:39 GMT
సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కి రెడీ అవుతున్న భారీ సినిమాల రిక‌వ‌రీ అనుమానంగా మారింది. ఓవైపు ఒమిక్రాన్ టెన్ష‌న్స్ మ‌రోవైపు ఏపీలో టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు వ్య‌వ‌హారం నిర్మాత‌లు పంపిణీ వ‌ర్గాల్ని టెన్ష‌న్ పెడుతున్నాయి. ఒమిక్రాన్ ను ఎవ‌రూ ఆప‌లేరు. క‌నీసం టికెట్ ధ‌ర‌ల్ని పెంచినా కొంత మేలు జ‌రిగేది. టికెట్ రేట్లు పెంచేలా వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంపై సినీపెద్ద‌లు ఒత్తిళ్లు తెచ్చినా అవేవీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. మెగాస్టార్ చిరంజీవి స‌హా సినీపెద్ద‌లంతా ఇప్ప‌టికే జ‌గ‌న్ ని అభ్య‌ర్థించారు. ఇటీవ‌ల మంత్రి పేర్ని నాని తో ప‌లుమార్లు స‌మావేశాలు ఏర్పాటు చేసినా ఫ‌లితం శూన్యంగా మారింది.

ప్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల్లోంచి టికెట్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు పోయే స‌న్నివేశం క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల హోంశాఖ కార్య‌ద‌ర్శి సార‌థ్యంలో వ‌ర్చువ‌ల్ స‌మావేశం సైతం టికెట్ పెంపుపై గ్యారెంటీని ఇవ్వ‌లేదు. కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల‌న్నీ సంక‌టంలో ప‌డ్డాయి. పంపిణీ దారులు బ‌య్య‌ర్లు పెట్టిన పెట్టుబ‌డులు తిరిగి వ‌స్తాయా లేదా? అన్న టెన్ష‌న్ ఏపీలో అలుముకుంది. ఇక టికెట్ ధ‌ర‌ల స‌వ‌ర‌ణ‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. నేచుర‌ల్ స్టార్ నాని.. సిద్ధార్థ్ వంటి హీరోలు ప‌బ్లిగ్గా చెడామ‌డా తిట్టేయ‌డం పెద్ద మైన‌స్ గా మారింద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. మ‌రోవైపు ఆ న‌లుగురు లోలోన మ‌రిగిపోతుండ‌గా.. నిర్మాత‌ల గిల్డ్ పెద్ద‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేయ‌గా ఇవేవీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఒక‌రు ప్ర‌భుత్వాన్ని తిడ‌తారు.. ఇంకొక‌రు జోకొడ‌తారు. కానీ ఏదీ ఫ‌లించ‌డం లేదు.

ఇలాంటి క్లిష్ఠ స‌న్నివేశంలో సినీప‌రిశ్ర‌మ ముందు ఉన్న ఈ స‌వాల్ ని స్వీక‌రించే మొన‌గాడెవ‌రు? అన్న చ‌ర్చా సాగుతోంది. ఇక‌పోతే చిరంజీవితో పాటు ప‌రిశ్ర‌మ‌కు సినీపెద్ద‌గా ఉన్న మోహ‌న్ బాబు కోర్టులోకి `టికెట్ బంతి` వ‌చ్చి ప‌డింద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. సీఎం జ‌గ‌న్ -రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబానికి బంధువే అయిన‌ ఎంబీని ప్ర‌యోగిస్తే జ‌గ‌న్ కొలువుపై బ్ర‌హ్మాస్త్రంలా ప‌ని చేస్తుంద‌న్న టాక్ స్ప్రెడ్ అయ్యింది. వైసీపీ నాయ‌కుడిగానూ విశేష సేవ‌లందిస్తూ జ‌గ‌న్ ని ప్ర‌శంసిస్తున్న న‌టుడు కం నిర్మాత‌ మోహ‌న్ బాబు చెబితే జ‌గ‌న్ వింటార‌ని కూడా గుస‌గుస‌ వినిపిస్తోంది.

త్వ‌ర‌లోనే మోహ‌న్ బాబు స్వ‌యంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి టికెట్ రేట్ల అంశంపై ఒక లేఖాస్త్రం సంధిస్తార‌ని ఆ మేర‌కు ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఆయ‌న‌తో మంత‌నాలు సాగించాయ‌ని చెబుతున్నారు. ``ఒక లేఖ రాస్తారు. అధికారికంగా మీడియా స‌మావేశంలోనూ టికెట్ రేట్ల అంశంపై జ‌గ‌న్ ని మోహ‌న్ బాబు అభ్య‌ర్థిస్తే ఫ‌లితం ఉంటుంద‌``ని గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌వేళ మోహ‌న్ బాబును ప్ర‌యోగించి టికెట్ రేట్ల సమ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోగ‌లిగితే నిజంగా అది ప‌రిశ్ర‌మ‌కు ఉప‌యుక్తంగా మారుతుంది. జ‌గ‌న్ కి స‌న్నిహితుడిగా అలాగే ఇండ‌స్ట్రీని ఏల్తున్న ఒక స‌మాజిక వ‌ర్గం అనుయాయుడిగా మోహ‌న్ బాబు మాట చెల్లుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్న వారి ప్ర‌చార‌మిది.

అయితే ఆయ‌న లేఖ రాస్తారా లేదా?   మీడియా ముందు స్పీచ్ ఇస్తారా లేదా? అన్న‌దానిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. ఆయ‌న రావాల‌ని ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవాల‌ని అంతా కోరుకుంటున్నారు. ఇప్ప‌టికే మోస్ట్ అవైటెడ్ 2022 పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి బ‌రి నుంచి వైదొల‌గ‌డం వెన‌క ఒమిక్రాన్ టెన్ష‌న్స్ ని మించి ఏపీలో టికెట్ ర‌గ‌డకు ప‌రిష్కారం దొర‌క్క‌పోవ‌డ‌మేన‌ని ఒక సెక్ష‌న్ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ఇదే సంక్రాంతికి రాధేశ్యామ్- భీమ్లా నాయ‌క్- బంగార్రాజు లాంటి భారీ చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. ఈ సినిమాల బిజినెస్ రేంజ్ ఓ లెవ‌ల్లో ఉంది. అలాంట‌ప్పుడు ఏపీలో త‌గ్గించిన టికెట్ రేట్ల‌తో రిట‌ర్నులు ఏమేర‌కు సాధ్యం? అన్న ఆందోళన బ‌య్య‌ర్ల‌లో నెల‌కొంది. ఇప్పుడు మోహ‌న్ బాబు మంత‌నాల‌తో టికెట్ రేటు స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే అంత‌కంటే ఏం కావాలి? అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతి బ‌రి నుంచి ఆర్.ఆర్.ఆర్ త‌ప్పుకోగానే.. వెంట వెంట‌నే నాలుగైదు చిన్న సినిమాల రిలీజ్ తేదీల‌తో పోస్ట‌ర్లు విడుద‌ల‌య్యాయి. వీటిలో చిరు అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన సూప‌ర్ మ‌చ్చి- ఎం.ఎస్.రాజు 7డేస్ 6నైట్స్ - యంగ్ ట్యాలెంట్ తో `డీజే టిల్లు` స‌హా ప‌లు చిత్రాలు విడుదల కాబోతోన్నాయి. వీట‌న్నిటికీ మేలు జ‌రిగే నిర్ణ‌యం ప్ర‌భుత్వం నుంచి వెలువడుతుందేమో చూడాలి. మ‌రోవైపు జ‌గ‌న్ సైతం ఏపీ సినిమా టికెట్ రేట్ల వ్య‌వ‌హారంపై ఓ ప్ర‌క‌ట‌న చేస్తార‌ని క‌థ‌నాలొస్తున్న వేళ అంత‌టా ఉత్కంఠ నెల‌కొంది. ఇప్పుడు టికెట్ బంతి ఎంబీ కోర్టులో ఉంది. ప‌రిష్కారం దొరుకుతుందా లేదా? అన్న‌దానికి వేచి ఉండాల్సి ఉంటుంద‌న్న గుస‌గుస వైర‌ల్ గా మారింది. ఇందులో ఏది నిజం? అన్న‌ది మంచు కాంపౌండ్ వెల్ల‌డించాల్సి ఉంటుంది.

ఒమిక్రాన్ టెన్ష‌న్స్..

ఒమిక్రాన్ టెన్ష‌న్స్ తో ఇప్ప‌టికే అన్ని మెట్రోల్లో థియేట‌ర్ల‌లో 50శాతం సీటింగ్ రూల్ అప్లై చేస్తున్నాయి ప్ర‌భుత్వాలు. నియ‌మ‌నిబంధ‌న‌ల్ని మార్చి జ‌నాల్ని భ‌య‌పెడుతున్నాయి.  పాన్ ఇండియా సినిమాలకు పెద్ద మార్కెట్ గా భావించే దిల్లీ- ముంబై- బెంగళూరు- చెన్నై లో ఒమిక్రాన్ ఆంక్షలు కఠినంగా అమల్లో ఉంటున్నాయి. థియేటర్లు 50 శాతం కెపాసిటీతోనే నడుస్తోన్నాయి. బెంగళూరులో రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే సినిమా చూసే అవ‌కాశం ఉంది. అందుకే పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ ల‌ను వాయిదా వేసుకుంటున్నాయ‌న్న ప్ర‌చారం ఉంది. తెలంగాణ‌లో టికెట్ రేట్లు బావున్నా ఏపీలో మ‌రీ ధైన్యంగా ఉండ‌డంతో ఇక్క‌డ ఇది ఒమిక్రాన్ ని మించిన స‌మ‌స్య‌గా మారింది.
Tags:    

Similar News