శింబుకు తెలుగులో పూర్వ వైభ‌వాన్ని తెస్తుందా?

Update: 2022-09-09 14:30 GMT
త‌మిళ సినిమాల జోరు తెలుగులో మ‌ళ్లీ మొద‌ల‌వుతోంది. ఈ మ‌ధ్య విడుద‌లైన క‌మ‌ల్ హాస‌న్ 'విక్ర‌మ్‌' తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకోవ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో త‌మిళ అనువాద చిత్రాల హ‌డావిడీ మొద‌లైంది. 'విక్ర‌మ్‌' తెలుగులో రిలీజ్ చేసిన శ్రేష్ట్ మూవీస్ కి మంచి లాభాల్సి తెచ్చిపెట్ట‌డంతో బ్యాక్ టు బ్యాక్ త‌మిళ సినిమాలని తెలుగులో రిలీజ్ చేసి మార్కెట్ చేసుకోవాల‌నే ప‌రంప‌ర మ‌ళ్లీ ఊపందుకుంటోంది.

రీసెంట్ గా ఆర్య న‌టించిన 'కెప్టెన్' ని కూడా శ్రేష్ట్ మూవీస్ నే రిలీజ్ చేసింది. పెద్ద‌గా న‌ష్టాలు ఏవీ రాక‌పోవ‌డం.. ల‌భాల‌కే అమ్ముడు పోతుండ‌టంతో చాలా మంది త‌మిళ సినిమాల‌పై దృష్టి పెట్టారు. తాజాగా మ‌రో రెండు త‌మిళ సినిమాలు తెలుగులో రిలీజ్ కావ‌డానికి రెడీ అవుతున్నాయి. ధ‌నుష్ న‌టించిన 'నానే వ‌రువేన్‌' తెలుగులో రిలీజ్ కాబోతోంది. సెప్టెంబ‌ర్ 30న ఈ మూవీని త‌మిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయ‌బోతున్నారు.

ధ‌నుష్ న‌టించిన 'తిరు' తెలుగులోనూ హిట్ కావ‌డంతో 'నానే వ‌రువేన్‌' కు మంచి పోటీ ఏర్ప‌డింది. ఇదిలా వుంటే ఇదే వ‌రుస‌లో శింబు న‌టించిన 'వెందు త‌న్నిదాతు కాడు' తెలుగులో సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల కాబోతోంది. గౌత‌మ్ మీన‌న్ చాలా రోజుల విరామం త‌రువాత చేసిన సినిమా కావ‌డం, శింబు చిన్న‌త‌నం నుంచి ఓల్డ్ ఏజ్ వ‌ర‌కు విభిన్నంగా సాగే పాత్ర‌ల్లో క‌నిపించ‌డం ఈ మూవీ ప్ర‌త్యేక‌త‌. ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందించాడు. గౌత‌మ్ మీన‌న్‌, శింబుల కాంబినేష‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌.

దీంతో ఈ మూవీపై త‌మిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే 'మ‌న్మ‌థ' త‌రువాత తెలుగులో శింబు మార్కెట్ దెబ్బ‌తింది. ఆ సినిమా త‌రువాత తెలుగులో రిలీజ్ చేసిన శింబు సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. ఇత‌ర హీరోల త‌ర‌హాలోనే 'వెందు త‌న్నిదాతు కాడు'తో తెలుగులో మ‌ళ్లీ పుంజుకోవాల‌నే ఆలోచ‌న‌లో వున్నాడ‌ట శింబు.

గ‌తంలో 'మానాడు'ని తెలుగులో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసినా రీమేక్ హ‌క్కుల్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద‌క్కించుకోవ‌డంతో అది కుద‌ర‌లేదు. ఈ సినిమాతో మ‌ళ్లీ తెలుగులో ట్రాక్ లోకి రావాల‌ని శింబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌.

ఈ మూవీని తెలుగులో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్ పై స్ర‌వంతి ర‌వికిషోర్ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ కు వారం రోజులు కూడా లేక‌పోవ‌డంతో సినిమా అన్ని వ‌ర్గాల‌కు చేర‌డం ఎలా అనే అనుమానాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. చాలా కాలంగా నిర్మాణం జ‌రుపుకున్న ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తెలుగులో స్ర‌వంతి మూవీస్ రిలీజ్ అవుతున్న ఈ మూవీ శింబుకు మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలంటే సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News