అల్లు అరవింద్ ఇంక రిలాక్స్ అయినట్లేనా?

ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన సైనికులు అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు.

Update: 2024-07-04 14:14 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో మెగా, అల్లు అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవి చంద్రా రెడ్డికి సపోర్ట్ చేయడంతో ఈ ఫ్యాన్ వార్ స్టార్ట్ అయింది. బన్నీ తన భార్యతో కలిసి శిల్పారవి ఇంటికి వెళ్లి మరీ ఆయనకు సంఘీభావం ప్రకటించడంపై మెగా అభిమానులు విమర్శలు చేశారు. మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్ పార్టీకి కాకుండా, ప్రత్యర్థి పార్టీకి మద్దతు తెలపడం ఏంటంటూ బన్నీ ఫ్యామిలీ మీద పడ్డారు. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన సైనికులు అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ట్రోలర్స్ కాస్త శాంతించినట్లుగా కనిపిస్తోంది.

మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతోందని ఎన్నాళ్ళ నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. ఇరు వర్గాలు ఎప్పటికప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చారు. అయినా సరే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో అల్లు అర్జున్ వైకాపా అభ్యర్థికి సపోర్ట్ చేయడం.. పోలింగ్ పూర్తయిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ఎక్స్ లో "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే" అంటూ పోస్ట్ చేయడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. శిల్పా రవి అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత బన్నీపై విపరీతంగా ట్రోలింగ్ చేశారు.

నాగబాబును అభిమానించే కమెడియన్ కిరాక్ ఆర్పీ లాంటి కొందరు బాహాటంగానే బన్నీపై విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది. మెగా జన సైనికులు ఆర్పీకి మద్దతుగా నిలిస్తూ అల్లు అభిమానులతో ఫ్యాన్ వార్లు చేశారు. అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న 'పుష్ప 2' సినిమాని తాము చూడమని, ఆ చిత్రాన్ని బాయ్ కాట్ చేస్తామంటూ జనసైనికులు పోస్టులు పెడుతూ వచ్చారు. వర్క్ ఫినిష్ అవ్వక 'పుష్ప 2' ను వాయిదా వేస్తే, దాన్ని కూడా పొలిటికల్ యాంగిల్ లో ట్రోల్ చేశారు. అలాంటి టైంలో అల్లు అరవింద్ రంగంలోకి దిగి, పవన్ కళ్యాణ్ ను మీట్ అవ్వడంతో సీన్ అంతా మారిపోయింది.

ఆంధ్రప్ర‌దేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, టాలీవుడ్ నిర్మాతలంతా విజయవాడలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాసు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వీరు కలిసి తీసుకున్న ఫొటోలను గీతా ఆర్ట్స్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అల్లు అరవింద్, పవన్ లు నవ్వుతూ ఎంతో సన్నిహితంగా కనిపించారు. మీటింగ్ లోనూ ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. బయటకి వచ్చిన తర్వాత కూడా అల్లు అరవింద్ తానే లీడ్ తీసుకొని ఉప ముఖ్యమంత్రితో భేటీ వివరాలను మీడియాకు తెలిపారు.

పవన్ కళ్యాణ్ తో అల్లు అరవింద్ సమావేశమైన తర్వాత, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ట్రోలింగ్ తగ్గిపోయింది. రోజూ పనిగట్టుకొని బన్నీ పై నెగిటివ్ పోస్టులు పెట్టే వారంతా సైలెంట్ అయిపోయారు. ఏదో సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు ఇరు వర్గాల అభిమానులు ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారే తప్ప.. కావాలని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, పర్సనల్ ఎటాక్స్ చేయడం పూర్తిగా ఆపేశారు. ఇదంతా చూస్తుంటే, పవన్ కళ్యాణ్ - అరవింద్ కలయిక తర్వాత 'మెగా - అల్లు' ఫ్యామిలీ అంతా ఒకటే అనే భావనకు వచ్చారేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News