అయోధ్య రామ‌య్య ప్రాణ ప్ర‌తిష్ఠ‌లో టాప్ స్టార్లు

అయోధ్య రామ మందిర ప్రాణ ప్ర‌తిష్ఠ‌.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశ‌మిది

Update: 2024-01-22 05:50 GMT

అయోధ్య రామ మందిర ప్రాణ ప్ర‌తిష్ఠ‌.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశ‌మిది. భారతీయ సినిమా., సాంస్కృతిక వారసత్వం మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని నొక్కిచెప్పే ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ స్టార్లు పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈరోజు అయోధ్యలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ స్టార్స్ అటెండ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. వీరంతా ఇప్ప‌టికే రామ మందిర ప‌రిస‌రాల‌కు చేరుకున్నార‌ని ఇన్ సైడ్ సోర్స్ చెబుతోంది. అలాగే ఆతిథ్యం అందుకున్న‌ జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయోధ్యకు ప్ర‌యాణ‌మ‌య్యార‌ని తెలిసింది.

వినోదం రంగం, సంగీత పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల నుంచి అతిథులుగా ఆహ్వానాలు అందుకున్నారు. సుమారు 500 మంది తెలుగు రాష్ట్రం నుంచి అతిథుల జాబితాను సిద్ధం చేయ‌గా, సినీరంగం నుంచి అగ్ర నటులు, దర్శకులు, గాయకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆధ్యాత్మిక‌ ఈవెంట్‌కు ఆహ్వానం అందిందని ఇంత‌కుముందు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ''ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగం కావడం విశేషం కాబట్టి నేను మా కుటుంబంతో కలిసి చారిత్రక కార్యక్రమానికి హాజరవుతాన‌ని ఆయన మీడియాతో అన్నారు. తాను హనుమంతుని భక్తుడినని, తన జీవితాంతం హ‌నుమాన్ ఆశీస్సులు పొందుతున్నానని కూడా చిరు అన్నారు. రామ మందిరం ప్రజల చిరకాల స్వప్నం.. 500 సంవత్సరాల తర్వాత ఇది ఎట్టకేలకు నిజం కాబోతోంది.. మేము చాలా సంతోషంగా ఉన్నాము'' అని వ్యాఖ్యానించారు.

అటు బాలీవుడ్ నుంచి ఇప్ప‌టికే అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కంగనా రనౌత్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, సంజయ్ లీలా భ‌న్సాలీ వంటి టాప్ స్టార్లు ఈవెంట్ కోసం ప్ర‌త్యేకంగా హాజ‌ర‌వుతున్నారు. వీరంతా ముంబై నుంచి అయోధ్య‌కు బ‌య‌ల్దేరిన‌ప్ప‌టి లుక్ లు కూడా ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో రిలీజ‌య్యాయి.

ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ కార్యక్రమానికి హాజరవుతున్న ఏకైక తెలుగు నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్. ఇది ప్రతి హిందువు.. భారతీయుడు గర్వించదగ్గ సందర్భం. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠను వీక్షించడం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రాంగణంలో ఉండటం మరియు.. సాక్ష్యంగా ఉండటం ఆనందాన్నిస్తోంద‌ని అభిషేక్ అగ‌ర్వాల్ అన్నారు. తెలుగు చిత్రం 'హనుమాన్' బాక్సాఫీసు కలెక్షన్ల నుండి రామమందిర నిర్మాణానికి 2.66 కోట్ల రూపాయలను విరాళంగా అందించడం గొప్ప విష‌యం. సంక్రాంతి బిలో వ‌చ్చిన ఈ సినిమా కోసం తెగిన‌ ప్రతి టిక్కెట్టు నుండి 5 రూపాయలు ఇస్తామని టీమ్ హామీ ఇచ్చారు. నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ఈ హామీని నిల‌బెట్టుకుంటూ రామ‌మందిరానికి భారీ విరాళాన్ని అందించారు.

వీళ్ల‌కు ఆహ్వానాలు అంద‌లేదా?

చిరు, చ‌ర‌ణ్ వారి కుటుంబ స‌భ్యుల‌తో అయోధ్య రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ఠ‌కు అటెండ‌వుతుండ‌గా, కొద్ది రోజుల క్రితం ప్ర‌భాస్ కు ఆహ్వానం అంద‌లేద‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అయితే అయోధ్య రామ‌మందిర ఉత్స‌వంపై ఎంతో ఉత్సాహంగా క‌నిపించిన దిగ్గ‌జ న‌టుడు, నిర్మాత మంచు మోహ‌న్ బాబు త‌న‌కు ఆహ్వానం అందింద‌ని వెల్ల‌డించారు. అయితే తెలుగు చిత్ర‌సీమ నుంచి వెళుతున్న ప్ర‌ముఖులంద‌రి ప్ర‌యాణానికి సంబంధించిన మ‌రిన్ని వివరాలు, మ‌రింత స‌మాచారం రావాల్సి ఉంది.

బాలీవుడ్ నుంచి ప‌య‌నం:

రామ్ లల్లా ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలీవుడ్ ప్రముఖులు జనవరి 22 ఉదయం అయోధ్యకు బయలుదేరారు. ముంబైలోని ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్‌లో తెల్లవారుజామున అనేక మంది సినీపెద్దలు కనిపించారు. రణబీర్ కపూర్- అలియా భట్ దంప‌తులు తెల్లవారుజామున సాంప్రదాయ దుస్తులలో కలిసి కనిపించారు. వీరికి రోహిత్ శెట్టి కూడా తోడయ్యాడు. అమితాబ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్ విమానాశ్రయం నుండి బయలుదేరడం కనిపించింది. కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ సంప్రదాయ అవతార్‌లలో కలిసి రావడం కనిపించింది. ఆయుష్మాన్ ఖురానా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేటప్పటికి తెల్లటి దుస్తులు ధరించాడు. మాధురీ దీక్షిత్ - డాక్టర్ శ్రీరామ్ నేనే కూడా అయోధ్యకు బయలుదేరడం కనిపించింది. ఒక రోజు ముందు సోనూ నిగమ్, సౌత్ సూపర్ స్టార్స్ రజనీకాంత్ - ధనుష్, భూషణ్ కుమార్, రణదీప్ హుడా అయోధ్యకు బయలుదేరడం క‌నిపించింది.

Tags:    

Similar News