సంక్రాంతి 2025: చిరంజీవి వ‌ర్సెస్ బాల‌య్య‌

సంక్రాంతి పందెంలో చిరంజీవి, బాల‌య్య పోటీ ప‌డితే ఎలా ఉంటుందో తెలిసిన‌దే.

Update: 2024-09-16 03:38 GMT

సంక్రాంతి పందెంలో చిరంజీవి, బాల‌య్య పోటీ ప‌డితే ఎలా ఉంటుందో తెలిసిన‌దే. మెగా వ‌ర్సెస్ నంద‌మూరి క్రేజ్ అంతా ఇంతా కాదు. రేసులో నిల‌వ‌డం.. అభిమానుల్లో ఉత్సాహం నింప‌డం.. చిరంజీవి- బాల‌కృష్ణ‌కు కొత్తేమీక కాదు. సంక్రాంతి పందెంలో ఉర‌క‌లెత్తే పుంజులివి. ఇంత‌కుముందు చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీనంబ‌ర్ 150తో బాల‌య్య బాబు `గౌత‌మి పుత్ర‌ శాత‌క‌ర్ణి` సినిమా పోటీప‌డింది. ఈ రెండు సినిమాలు విజ‌యం సాధించ‌డ‌మే గాక అదే సీజ‌న్ లో వ‌చ్చిన శ‌ర్వానంద్ ఫ్యామిలీ డ్రామా కూడా స‌క్సెస్ ని చూసింది.

ఇప్పుడు మ‌రోసారి మెగాస్టార్ వ‌ర్సెస్ న‌ట‌సింహా వార్ కి రంగం సిద్ధ‌మైంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. చిరంజీవి విశ్వంభ‌రతో ఎన్బీకే 109 పోటీప‌డ‌నుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన తదుపరి భారీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో సంక్రాంతి రిలీజ్ ఖాయ‌మ‌నే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ చిత్రం 9 జనవరి 2025న భారీగా విడుదలయ్యేందుకు ఛాన్సుంద‌ని చెబుతున్నారు. గత సంవత్సరం.. సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ - బాబీ ఉత్సాహంగా బ‌రిలో కి రావాల‌నుకుంటున్నార‌ని గుస‌గుస వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది నిజమైతే సంక్రాంతి సమయంలో చిరంజీవి విశ్వంభరతో బాలకృష్ణ చిత్రం పెద్ద ఘర్షణను ఎదుర్కొంటుంది.

బాలకృష్ణతో పాటు ఎన్బీకే 109లో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ -ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశీ-సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. NBK 109 రిలీజ్ తేదీపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Tags:    

Similar News