బాలకృష్ణ కాళ్ళు మొక్కిన బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్!

ఇదే క్రమంలో ఇటీవల గ్రాండ్ గా జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో బాలయ్యకు అరుదైన గౌరవం దక్కింది.

Update: 2024-11-05 17:54 GMT

నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ తరపున 50 వసంతాల గోల్డెన్ జూబ్లీ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఇదే క్రమంలో ఇటీవల గ్రాండ్ గా జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో బాలయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు 'గోల్డెన్ లెగసీ' పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఓ విషయం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

దుబాయ్ లో అట్టహాసంగా నిర్వహించిన ఇఫా అవార్డ్స్ ఉత్సవం (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ - 2024) కార్యక్రమాన్ని జెమినీ టీవీలో ఆదివారం ప్రసారం చేశారు. ఈవెంట్ కు దగ్గుబాటి రానా, తేజ సజ్జ హోస్టులుగా వ్యవహరించారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చేతుల మీదుగా బాలకృష్ణకు గోల్డెన్ లెగసీ పురస్కారం అందజేయబడింది. అవార్డ్ అందించే ముందు కరణ్.. బాలయ్య కాళ్ళకు మొక్కారు.

దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత పెద్ద ప్రొడ్యూసర్ గౌరవంగా మన బాలయ్య పాదాలకు నమస్కరించాడంటే.. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అందరూ అర్థం చేసుకోవాలని నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పెద్దల పట్ల గౌరవభావంతో మెలిగిన కరణ్ జోహర్ ను సైతం అభినందిస్తున్నారు.

ఇదే ఐఫా ఉత్సవం ఈవెంట్ లో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా బాలకృష్ణ కాళ్ళు మొక్కిన సంగతి తెలిసిందే. నిజానికి బాలీవుడ్ సెలబ్రిటీలు మన టాలీవుడ్ ప్రముఖుల కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకోవడాన్ని ఇటీవల కాలంలో మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. గతంలో 'బ్రహ్మాస్త్ర' ఈవెంట్ లో కింగ్ అక్కినేని నాగార్జున కాళ్లకు మొక్కారు నిర్మాత కరణ్ జోహార్. హీరో రణబీర్ కపూర్ సైతం నాగార్జున, ఎస్.ఎస్ రాజమౌళి కాళ్ళకు నమస్కరించారు.

సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. 'కల్కి' ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కాళ్ళు మొక్కారు. ఈ మధ్య అక్కినేని అవార్డ్స్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవన్నీ మన దర్శక హీరోలు, నిర్మాతల మీద బాలీవుడ్ స్టార్స్ కు ఉన్న ఆరాధ్య భావాన్ని తెలియజేస్తాయి. అదే విధంగా వారిపై తెలుగు ప్రేక్షకులు మరింత ప్రేమను చూపించడానికి, గౌరవాన్ని పెంపొందించడానికి కారణమవుతాయి.

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత భాషా, ప్రాంతీయత అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు నార్త్ మార్కెట్ లోనూ సత్తా చాటిన తర్వాత, పాపులర్ బాలీవుడ్ యాక్టర్స్ కూడా మన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. హిందీ దర్శక నిర్మాతలు మన హీరోలతో సినిమాలు చేయడానికి ఆరాట పడుతున్నారు. అలానే మన దర్శక నిర్మాతలు బాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు రూపొందిస్తున్నారు.

Tags:    

Similar News