'బాపు' మూవీ రివ్యూ
హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బహుముఖ ప్రజ్ఞ చాటిన సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా.. బాపు.
'బాపు' మూవీ రివ్యూ
నటీనటులు: బ్రహ్మాజీ-ఆమని-సుధాకర్ రెడ్డి-ధన్య బాలకృష్ణన్-శ్రీనివాస్ అవసరాల-మణి ఏగుర్ల-గంగవ్వ-రచ్చ రవి తదితరులు
సంగీతం: ధ్రువన్
ఛాయాగ్రహణం: వాసు పెండెం
నిర్మాణం: కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ
రచన-దర్శకత్వం: దయ
హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బహుముఖ ప్రజ్ఞ చాటిన సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా.. బాపు. 'బలగం' తరహాలో తెలంగాణ పల్లెటూరి ముఖచిత్రాన్ని ఆవిష్కరించే సినిమాలా కనిపించింది 'బాపు' ప్రోమోలు చూస్తే. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: మల్లన్న (బ్రహ్మాజీ) తెలంగాణలోని ఓ పల్లెటూరిలో పేద రైతు. అతడి మీద కుటుంబ బాధ్యతలు చాలా ఉంటాయి. వాటితో పాటు అప్పులనూ మోస్తుంటాడు. పత్తి పంట చేతికి వస్తే అప్పు తీర్చి కుటుంబ అవసరాలు తీర్చుకోవాలని చూస్తున్న తరుణంలో.. వర్షం వల్ల ఆ పంట మొత్తం నాశనం అవుతుంది. అప్పులు తీర్చడానికి పొలం అమ్మడమో.. తాను చావడమో అన్న పరిస్థితి వస్తాడు మల్లన్న. ఈ పరిస్థితుల్లో తమ కష్టాలు తీర్చుకోవడానికి మల్లన్న-అతడి భార్య ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఆ ఉపాయం ఏంటి.. దాన్ని వాళ్లు అమలు చేయగలిగారా.. ఇందులో మల్లన్న తండ్రి పాత్ర ఏంటి.. చివరికి ఈ కుటుంబ కష్టాలు తీరాయా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: తెలంగాణ పల్లె కథలకు మంచి ఊపు తెచ్చిన చిత్రం.. బలగం. అంతకుముందు కూడా ఇలాంటి మంచి ప్రయత్నాలు కొన్ని జరిగినా.. 'బలగం' తర్వాత వచ్చిన మార్పు వేరు. ఇక్కడి నేటివిటీని హైలైట్ చేస్తూ సహజంగా.. స్వచ్ఛంగా కథలను చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఫిలిం మేకర్స్. ఐతే చాలా కథలు 'బలగం'ను గుర్తుకు తెస్తున్నాయి కానీ.. 'బలగం'లా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి. గత ఏడాది వచ్చిన 'పొట్టేల్' ఈ కోవలోని చిత్రమే. ఓ మంచి కథను చెప్పాలన్న ప్రయత్నం బాగున్నా.. పకడ్బందీ కథనం కొరవడి ఆ చిత్రం టార్గెట్ ఆడియన్సుని రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు 'బాపు' కూడా ఆ వరుసలో నిలిచే చిత్రమే. ఇందులో ప్లాట్ పాయింట్ వింటే భలేగా అనిపిస్తుంది. కథలో ఆ మలుపు దగ్గర ప్రేక్షకులు అమితాసక్తితో చూస్తారు. కానీ ఆ ఐడియాను మొదలుపెట్టడం బాగున్నా.. తర్వాత దాన్ని అంతే ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లలేకపోయాడు రైటర్ కమ్ డైరెక్టర్ దయ. విరామం దగ్గర భలేగా అనిపించే 'బాపు'.. చివరికి ఒక సగటు చిత్రంలా ముగుస్తుంది. ఓవరాల్ గా ఈ చిత్రం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది.
ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కథలు ఒకప్పుడు పత్రికల్లో హైలైట్ అయ్యేవి. ఆ పాయింట్ మీద కాస్త సరదాగా ఓ కథ చెప్పడానికి ప్రయత్నించాడు దర్శకుడు దయ. సమస్యలన్నీ చుట్టుముట్టిన పరిస్థితుల్లో ఆత్మహత్యకు సిద్ధమైన ఓ కుటుంబ పెద్ద.. చావాల్సిన పరిస్థితే వస్తే నువ్వెందుకు చావడం, కుటుంబానికి బరువైన పెద్దాయన చనిపోతే సరిపోతుంది కదా అని చెప్పే భార్య.. అపరాధ భావం వెంటాడుతున్నా సరే.. కుటుంబమంతా ఆ మాటకే ఓటు వేసి ఆ ముసలాయన చావు కోసం ఎదురు చూస్తే..? ఇదీ బాపు ప్లాట్ పాయింట్. ఈ కుటుంబం అంతటి దయనీయ స్థితికి ఎందుకొచ్చిందో తెలియజేస్తూ ముందు వారి కష్టాల నేపథ్యంలో కథ నడుస్తుంది. కొన్ని సన్నివేశాలు హృద్యంగానే అనిపిస్తాయి. కాకపోతే రియలిస్టిగ్గా కథను చెప్పే ప్రయత్నంలో దర్శకుడి నరేషన్ మరీ నెమ్మదించింది. కొన్ని సీన్లు బాగున్నా సరే.. కథనం మరీ నత్తనడకన సాగుతున్న భావన కలుగుతుంది. కథలో కీలక మలుపు వచ్చే దగ్గర ప్రేక్షకుల ఆసక్తిని రాబడుతుంది బాపు.
ఐతే ఈ మలుపు తర్వాత కథ ఎలా ముందుకు వెళ్తుంది.. దీనికి ముగింపు ఏంటి అనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది కానీ.. దీన్ని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపించినా.. కథనంలో బిగి కనిపించదు. ప్రథమార్ధంలో మాదిరే నరేషన్లో వేగం లేకపోవడం మరో సమస్య. రసవత్తరంగా కథనాన్ని నడిపించడానికి తగ్గ పునాది పడ్డా.. దాన్ని దర్శకుడు ఉపయోగంచుకోలేదనిపిస్తుంది. చాలా వరకు బోర్ కొట్టించే ద్వితీయార్ధం.. బాపు గ్రాఫ్ ను తగ్గించేస్తుంది. సినిమా ముగింపు కూడా సాధారణంగా అనిపిస్తుంది. ఎమోషన్లు అనుకున్నంత స్థాయిలో పండలేదు. పెద్ద సమస్యకు సింపుల్ గా పరిష్కారం దొరికేయడం.. పెద్దగా డ్రామా ఏమీ లేకపోవడంతో బాపు ఒకింత నిరాశనే మిగులుస్తుంది. ఓ మంచి ఐడియాతో నిజాయితీగా ఓ కథను చెప్పే ప్రయత్నం జరగడం అభినందనీయమే అయినా.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కథనం మాత్రం ఇందులో కొరవడింది.
నటీనటులు: బ్రహ్మాజీ నటుడిగా తనలో ఒక కొత్త కోణాన్ని చూపించాడు 'బాపు'లో. ఈ మధ్య ఎక్కువగా కామెడీ క్యారెక్టర్లే చేస్తున్న ఆయన.. సీరియస్ పాత్రలో బాగానే ఒదిగిపోయాడు. తెలంగాణ పల్లెటూరి పేద రైతుగా బ్రహ్మాజీని చూడడం భిన్నంగా అనిపిస్తుంది. తెలంగాణ యాసను ఒడిసిపట్టేశాడు అని చెప్పలేం కానీ.. నాట్ బ్యాడ్ అని మాత్రం చెప్పొచ్చు. ఆమనికి కూడా ఈ పాత్ర కొత్తగానే అనిపిస్తుంది. ఆమె కూడా చక్కగా నటించింది. పేదరికంతో పోరాడుతూ కుటుంబం కోసం తపన పడే భార్యాభర్తలుగా బ్రహ్మాజీ-ఆమని మెప్పించారు. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి మరోసారి కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. దాదాపుగా బలగం తరహా పాత్రలోనే ఆయన కనిపించాడు. ఆయన ఎక్కడా నటిస్తున్న ఫీలింగ్ కలగదు. అంత సహజంగా కనిపించాడు. అక్కా తమ్ముళ్ల పాత్రల్లో ధన్య బాలకృష్ణన్.. మణి ఏగుర్ల కూడా బాగా చేశారు. ముఖ్యంగా ధన్యను ఇలాంటి పాత్రలో ఊహించలేం. రచ్చ రవి.. మిగతా ఆర్టిస్టులు కూడా బాగానే చేశారు.
సాంకేతిక వర్గం: బాపు సాంకేతికంగా ఓకే అనిపిస్తుంది. ధ్రువన్ సాంగ్స్.. తెలంగాణ పల్లె పాటలను గుర్తు తెస్తాయి. ఈ కథలో ఆ పాటలో బాగానే ఇమిడిపోయాయి. నేపథ్య సంగీతం బాగానే సాగింది. వాసు పెండెం ఛాయాగ్రహణం పర్వాలేదు. సినిమాను పరిమిత బడ్జెట్లో తెరకెక్కించిన విషయం తెరపై కనిపిస్తుంది. ఇండీ సినిమాల లుక్ కనిపిస్తుంది సినిమాలో. రచయిత-దర్శకుడు దయ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ కథగా ఇంకా బలం చేకూరాల్సింది. ఆసక్తికర స్క్రీన్ ప్లే తోడై ఉంటే బాపు స్పెషల్ మూవీ అయ్యుండేది. తెలంగాణ పల్లెటూరి నేటివిటీని బాగానే చూపించాడు. ఆర్టిస్టుల నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు.
చివరగా: బాపు.. మధ్యలో దారి తప్పిన మంచి ప్రయత్నం
రేటింగ్-2.25/5