బెల్లంకొండ సురేష్ కామెంట్స్ 'మంచు బ్రదర్స్' వివాదాన్ని ఉద్దేశించేనా?

ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసారు.

Update: 2024-12-13 14:30 GMT

సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్.. గత కొన్నేళ్లుగా యాక్టీవ్ గా సినిమాలు చేయడం లేదు. తన కుమారులిద్దరూ హీరోలుగా సినిమాలు చేస్తున్నారు కానీ, ఆయన మాత్రం తన ప్రొడక్షన్ లో మూవీస్ చేయలేదు. ఇన్నాళ్లూ రియల్ ఎస్టేట్ మీద దృష్టి పెట్టిన సురేష్.. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ తన బ్యానర్ లో సినిమాలు తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసారు.

ప్రస్తుతం సినిమాల పట్ల ప్రేక్షకుల అభిరుచి గురించి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ.. ''కేవలం మాస్ చేస్తే జనాలు చూడరు. ఇప్పుడు మాస్, ఫైట్స్ హెవీగా ఉండకూడదు. 'పుష్ప 2' సినిమాని జనాలు ఎంజాయ్ చేసున్నారంటే, అందులో యాక్షన్ తో పాటుగా ఎమోషన్ ఉంది. పార్ట్-1, పార్ట్-2లో బ్రదర్ సెంటిమెంట్ ఉంది. సెకండ్ వైఫ్ ఫ్యామిలీని.. ఇప్పుడు లైవ్ లో కూడా కొన్ని జరుగుతున్నాయి. సెకండ్ వైఫ్ పిల్లల్ని ఇబ్బంది పెడితే, వాళ్ళు ఎగిరి వచ్చి తగిలితే ఆ ఫ్యామిలీ ఎలా సెట్ అయింది.. ఆ ఫ్యామిలీ ఎట్లా కలిసింది.. అతను ఎలా లేచాడు అనే దాని మీద గ్యారంటీగా మంచి ఎమోషన్ ఉంది. అంత యాక్షన్ లో కూడా ఆ ఎమోషన్ ఉంది కాబట్టే, బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది'' అని అన్నారు.

''బ్రదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఏ సినిమా తీసుకున్నా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 'బాహుబలి' తీసుకుంటే స్టెప్ బ్రదర్స్ రైవల్రీ.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో 'పెద్దన్నయ్య', 'అన్నదమ్ముల అనుబంధం', 'మా అన్నయ్య', 'సంక్రాంతి', 'లక్ష్మీ'.. 'బాషా, 'మర్ద్, 'అమర్ అక్బర్ ఆంటోనీ'.. ఇలా స్టెప్ బ్రదర్ సెంటిమెంటుతో ఎమోషనల్ గా వెళ్లే సినిమాలు మంచి హిట్టయ్యాయి. చెప్పుకుంటూ పోతే చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకూ చాలా ఉన్నాయి. గతంలో కానీ, భవిష్యత్ లో కానీ.. అన్ని భాషల్లోనూ బ్రదర్ సెంటిమెంట్, స్టెప్ బ్రదర్ సెంటిమెంటుతో తీసిన సినిమాల్లో ఎమోషనల్ గా కనెక్ట్ అయితే డెఫినిట్ గా బ్లాక్ బస్టర్ అవుతాయి'' అని బెల్లంకొండ సురేష్ చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు లైవ్ లో కూడా కొన్ని జరుగుతున్నాయని బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు.. మంచు ఫ్యామిలీ గొడవలను ఉద్దేశించే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే మంచు కుటుంబం.. ఇటీవల వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. మంచు బ్రదర్స్ మధ్య తలెత్తిన విబేధాలతో మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకూ వెళ్లారు. గత కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ కామెంట్స్ చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

నిజానికి బెల్లంకొండ సురేష్ కు మంచు ఫ్యామిలీతో గతంలో ఓ వివాదం ఉంది. మంచు మనోజ్ హీరోగా ఆయన సోదరి మంచు లక్ష్మి నిర్మించిన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం కోసం రూపొందించిన గంధర్వ మహల్ బంగ్లా సెట్‌ని.. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బెల్లంకొండ సురేష్‌ నిర్మించిన 'రభస' సినిమాకి ఉపయోగించుకున్నారు. ఇందుకుగాను రూ. 58 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే 'రభస' విడుదలకు సిద్ధమైనా, పేమెంట్స్ క్లియర్ చేయలేదంటూ మంచు లక్ష్మి అనుచరులు అప్పట్లో బెల్లంకొండ సురేష్‌ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ వివాదంలో ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత ఎవరూ ఈ ఇష్యూ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు.

ఇదిలా ఉంటే, మంచు మనోజ్ ప్రస్తుతం బెల్లంకొండ సురేష్‌ పెద్ద కొడుకు సాయి శ్రీనివాస్ తో కలిసి ''భైరవం'' అనే సినిమాలో నటిస్తుండటం గమనార్హం. ఇందులో నారా రోహిత్ మరో హీరో. తమిళ్ లో హిట్టైన 'గరుడన్' తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News