ఓటీటీలో రీమేక్..ఇంత ఆలస్యమైందేటి రాజా!
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి' ని బాలీవుడ్ లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి' ని బాలీవుడ్ లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా..వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని హిందీ లో తెరకెక్కించారు. ఇద్దరికి ఇదే బాలీవుడ్ డెబ్యూ. దీంతో సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసారు. ఈ సినిమా హిట్ తో ఇద్దరు బాలీవుడ్ లో పాగా వేయాలని ప్లాన్ చేసారు.
తెలుగు కంటెంట్ కూడా బాలీవుడ్ లో కూడా సక్సెస్ అవుతోన్న నేపథ్యంలో ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అటుపై రిలీజ్ కి ముందు హిందీ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. మేలో సినిమా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే తొలి షోతోనే రీమేక్ పై విమర్శల వర్షం మొదలైంది. రీమేక్ చేయడంలో వినాయక్ తడబాట్లు స్పష్టంగా కనిపించాయి. సాయి శ్రీనివాస్ నటన.. డైలాగ్ డిక్షన్ ప్రతీది అతనికి వ్యతిరేక పవనాలు వీచేలా చేసింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
పెట్టిన పెట్టుబడి సంగతి అటుంచితే కనీసం సినిమాకి 10 కోట్లు కూడా రాలేదు. కేవలం ఐదు కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా సాయి శ్రీనివాస్ కి-వినాయక్ కి బాలీవుడ్ లో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇలా రెండు..మూడు రోజుల్లోనే థియేటర్ల నుంచి ఎగ్జిట్ అయిన సినిమా అదే వ్యవధిలో ఓటీటీలోకి రావడం సహజం. ఎలాగూ ముందే ఒప్పందం ఉంటుంది కాబట్టి ఓటీటీ కి రిలీజ్ కి ఎలాంటి అడ్డంకి ఉడదు.
కానీ ఈ రీమేక్ సినిమా ఓటీటీ రావడానికి మాత్రం చాలా సమయం పట్టినట్లు తెలుస్తుంది. ఆగస్టు 18 నుంచి సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. జీ-5 రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. 'ఛత్రపతి'' ఒరిజినల్ వెర్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసింది. ఆ విజయం ప్రభాస్ రేంజ్ నే మార్చేసింది.