నిర్మాత-హీరోయిన్ విడిపోలేదు.. కలిసే ఉన్నారు!
వరుసగా తెలుగు హీరోలు, తెలుగు దర్శకులతో కలిసి పని చేస్తున్న టీసిరీస్ ఇప్పుడు టాలీవుడ్ లో పాపులర్ బ్యానర్ గా మారింది
వరుసగా తెలుగు హీరోలు, తెలుగు దర్శకులతో కలిసి పని చేస్తున్న టీసిరీస్ ఇప్పుడు టాలీవుడ్ లో పాపులర్ బ్యానర్ గా మారింది. ప్రభాస్, సందీప్ వంగా వంటి ప్రతిభావంతులతో టీసిరీస్ వరుస చిత్రాలను నిర్మిస్తోంది. ఇక టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ పేరు బాలీవుడ్ తో పాటు, తెలుగు చిత్రసీమలోను మార్మోగుతోంది.
ఆయన ప్రముఖ హీరోయిన్ దివ్య ఖోస్లాని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే భూషణ్ నుంచి దివ్య ఖోస్లా విడిపోతున్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇటీవల యారియాన్ 2 లో నటించిన దివ్య ఖోస్లా సోషల్ మీడియాల్లో తన పేరు నుండి 'కుమార్'ని తొలగించడంతో చాలా మంది షాక్ అయ్యారు. ఇంతకుముందు దివ్య ఖోస్లా కుమార్ అని పిలుచుకునేవారు. కానీ సదరు నటి సినీనిర్మాతగా మారాక.. ఇప్పుడు దివ్య ఖోస్లాగా మారింది. ఈ చర్య T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో బ్రేకప్ ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అయితే తాజాగా నిర్మాణ సంస్థ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ మార్పు వెనుక కారణం జ్యోతిష్యమని వారి అనుబంధానికి ఎలాంటి డోఖా లేదని వెల్లడించారు.
సన్నిహితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. దివ్య ఖోస్లా తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల మెరుగుదల కోసం అలా చేయమని జ్యోతిష్కుడు సలహా ఇవ్వడంతో ఈ మార్పు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి దివ్య ఖోస్లా అకా దివ్య ఖోస్లా కుమార్ దాదాపు రెండు దశాబ్దాలుగా T-సిరీస్ అధినేత, నిర్మాత భూషణ్ కుమార్‌తో వివాహ బంధంలో సంతోషంగా ఉన్నారని తాజా ప్రకటన పేర్కొంది. చాలా కథనాలకు విరుద్ధంగా.. ఈ జంట ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉన్నారు! అని ప్రకటన వెల్లడించింది. టి సిరీస్ ప్రతినిధి మాట్లాడుతూ-''దివ్య ఖోస్లా పెళ్లి అనంతరం తన ఇంటిపేరును వదులుకోవడం జ్యోతిషశాస్త్ర విశ్వాసం సూచనల ప్రకారం నడుస్తుంది. ఇది వ్యక్తిగత నిర్ణయం. దీనిని అందరూ గౌరవించాలి. తన మొదటి ఇంటిపేరుకు 's' అనే అక్షరాన్ని జోడించారు. జ్యోతిషశాస్త్ర విశ్వాసం అదే ఆలోచనకు ప్రతీక! అని ప్రకటనలో వెల్లడించారు. అయితే దివ్య ఖోస్లా సోషల్ మీడియాలో టి-సిరీస్‌ని అనుసరించడం మానేసిందని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
కొన్ని సంవత్సరాల క్రితం.. ఔత్సాహిక మోడల్ కం నటి అయిన దివ్య ఖోస్లా అనేక మ్యూజిక్ వీడియోలలో భాగమైన తర్వాత 2004లో హిందీ, తెలుగులోకి ప్రవేశించింది. అయితే 2005లో T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో వివాహం తర్వాత పరిశ్రమ నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ జంట కత్రాలో ముడిపడిన తరువాత అక్టోబర్ 2011లో ఒక వారసునికి గర్వించదగిన తల్లిదండ్రులయ్యారు. అనంతరం దివ్య తిరిగి నటనలోకి రావాలని నిర్ణయించుకుంది. 2014లో 'యారియాన్'తో దర్శకురాలిగా అరంగేట్రం చేసి 2016లో 'సనమ్ రే' చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వాత 2021లో 'సత్యమేవ జయతే 2'లో తిరిగి నటించింది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగాను కొనసాగుతున్నారు.