Begin typing your search above and press return to search.

వేణు స్వామికి బిగ్ షాక్.. కేసు నమోదు

ప్రధాని మోదీ ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   13 Sep 2024 12:15 PM GMT
వేణు స్వామికి బిగ్ షాక్.. కేసు నమోదు
X

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. జ్యోతిష్యం ముసుగులో వేణు స్వామి అనేక మంది వ్యక్తులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ టీవీ5 తెలుగు న్యూస్ ఛానెల్‌ కు చెందిన జర్నలిస్ట్ మూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. ప్రధాని మోదీ ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

అలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని, దాంతోపాటు వేణు స్వామి మోసాలను వెలుగులోకి తీసుకొచ్చిన తనపై కుట్ర పన్నారని కూడా మూర్తి పిటిషన్ లో ప్రస్తావించారు. అయితే పిటిషన్ ను శుక్రవారం విచారించిన నాంపల్లి కోర్టు.. పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. వెంటనే వేణు స్వామిపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల తర్వాత వేణు స్వామి ఇప్పటికీ స్పందించలేదు.

అయితే గత కొద్ది రోజులుగా వేణు స్వామి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. యంగ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకోగా.. వేణు స్వామి వారి జాతకమంటూ వీడియో రిలీజ్ చేశారు. పెళ్లి చేసుకున్నా వారు విడిపోతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వేణు స్వామిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అలా కరెక్ట్ కాదని.. జాతకం విషయంలో తప్పుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని అనేక మంది నిలదీశారు.

సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రజా సంఘాలూ మండిపడ్డాయి. మహిళా కమిషన్ చైర్మన్‌ కు ఫిర్యాదు వచ్చింది. ఆ సమయంలో గతంలో జాతకాల పేరుతో వేణు స్వామి అనేక మందిని మోసం చేశారని.. జర్నలిస్ట్ మూర్తి బయటపెట్టారు. ఆధారాలు కూడా చూపించారు. అయితే తన వద్ద డబ్బులు వసూలు చేయడానికి మూర్తి ఇలా చేస్తున్నారని.. వేణు స్వామి దంపతులు ఆరోపణలు చేశారు.

అప్పుడు ఓ ఆడియో టేపును వినిపించారు. కానీ ఆడియో టేప్ లో మాట్లాడుకున్న వారు కూడా వేణు స్వామి సన్నిహితులేనని మూర్తి ఫోటోలు బయట పెట్టారు. అయితే తాను వేణు స్వామి కుట్రలు బయటపెట్టినందకు.. తనను హతమార్చే యత్నం జరిగిందని కోర్టులో పిటిషన్ వేశారు మూర్తి. ఇప్పుడు మూర్తి తరఫున లాయర్ వాదనలు విన్న కోర్టు.. వేణు స్వామి పై కేసు ఫైల్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.