చ‌రిత్ర‌కారుడు బాబు జగ్జీవన్ రామ్ బయోపిక్

బాబూజీ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరావూరులో జరుగుతోందని తెలుగు సినీ దర్శకుడు దిలీరాజా తెలిపారు.

Update: 2024-01-08 04:26 GMT

క్రీడాకారులు, రాజ‌కీయ నాయ‌కులు లేదా ఏదైనా రంగంలో ప్ర‌సిద్ధి చెందిన ప్ర‌ముఖుల జీవిత‌క‌థ‌ల‌తో సినిమాలు తీస్తే అవి గొప్ప‌ ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. కంటెంట్ ని ఇంట్రెస్టింగ్ గా తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు ప‌నిత‌నం చూపిస్తే ఆద‌ర‌ణ‌కు కొద‌వేమీ లేదు. ఇప్పుడు అదే కోవ‌లో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ (బాబూజీ) బయోపిక్ తెర‌కెక్కుతోంది. బాబూజీ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెదరావూరులో జరుగుతోందని తెలుగు సినీ దర్శకుడు దిలీరాజా తెలిపారు.

ప్రస్తుతం పెదరావూరులో వేసిన సెట్‌లో బీహార్‌లోని జగ్జీవన్ రామ్ స్వస్థలమైన చాంద్వా గ్రామానికి సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది రెండో షెడ్యూల్‌. మరో రెండు షెడ్యూల్స్ చేయాల్సి ఉంది. మొత్తం షూటింగ్‌కి మరో నాలుగు నెలలు పట్టనుంది. విద్యుత్ లైన్లు, రోడ్లు, కాంక్రీట్ భవనాలు లేకుండా చాంద్వా సెట్‌ను రూపొందించినట్లు దిలీప్ రాజా వెల్లడించారు. బాబూ జగ్జీవన్ రామ్ చారిత్రక ఘట్టాలను చాలా సాంకేతిక విలువలను దృష్టిలో ఉంచుకుని చిత్రీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రపంచంలోనే అత్యధిక కాలం పాటు భారత పార్లమెంట్‌లో వివిధ పదవులను చాలా సమర్థవంతంగా నిర్వహించిన చారిత్రక వ్యక్తి జ‌గ్జీవ‌న్ అలియాస్ బాబూజీ. జగ్జీవన్ రామ్ పాత్రను ఇండియన్ ఆర్మీ మాజీ సైనికుడు మిలటరీ ప్రసాద్ పోషిస్తున్నారు. సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగిన బాబూజీ కుమార్తె మీరా కుమార్ పాత్రలో నటిస్తున్నారు. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి పాత్రలు ఈ బ‌యోపిక్ లో చాలా ముఖ్యమైనవని, ఈ సినిమా పూర్తయ్యాక అన్ని భారతీయ భాషల్లో విడుదలవుతుందని దిలీప్ రాజా తెలిపారు. బయోపిక్‌లో వివిధ పాత్రలకు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం నటీనటులను ఎంపిక చేసినట్లు దర్శకుడు వెల్లడించారు.

Tags:    

Similar News