మెగా స్ఫూర్తితో TMTAU ఆర్టిస్టుల రక్తదానం
తెలంగాణ మూవీ అండ్ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ (TMTAU) మెగా స్ఫూర్తితో ముందుకు సాగుతోందని అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ మూవీ అండ్ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ (TMTAU) మెగా స్ఫూర్తితో ముందుకు సాగుతోందని అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. యూనియన్ జనరల్ బాడీ మీటింగ్ జూలై 14 ఆదివారం రోజున, భాగ్ లింగంపల్లి లోని, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుందని తెలిపారు. సభ్యులకు ఉదయం 8:00 గం నుండి 9:00 గం వరకు శిభిరంలో ఏర్పాట్లు ఉంటాయి. ఉదయం 9:00 గం నుండి సాయింత్రం 5:00 గం వరకు జరిగే జనరల్ బాడీ సమావేశంలో అసోసియేషన్ కీలక నిర్ణయాలను తీసుకోనుంది. సభ్యుల సంక్షేమం హెల్త్ కార్డులు సహా ఇండ్ల సమస్య పరిష్కారం గురించి చర్చించనున్నారని తెలుస్తోంది.
ఈ ఆదివారం నాడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రక్తదానము 8 గంటలకు ప్రారంభమవుతుందని అధ్యక్షుడు ఏ.రాజశేఖర్, జనరల్ సెక్రటరీ బోయిడి నూకరాజు ఒక ప్రకటనలో వెల్లడించారు. రక్తదానం చేసిన రక్తదాతలకి చిరంజీవి- రామ్ చరణ్ స్వహస్తాలతో సంతకం చేసిన ప్రశంస పత్రాన్ని మంత్రివర్యుల చేతుల మీదుగా అందజేస్తామని తెలియజేసారు. మెగా స్ఫూర్తితో అసోసియేషన్ సేవాకార్యక్రమాల్లో ముందుకు సాగుతుందని టీఎంటీఏయు అధ్యక్ష కార్యదర్శులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) తర్వాత హైదరాబాద్ లో మనుగడలో ఉన్న అతిపెద్ద అసోసియేషన్ గా టీఎంటీఏయు అవతరించింది. ఇందులో సుమారు 1200 మంది పైగా ఆర్టిస్టులకు సభ్యత్వాలు ఉండడంతో ఇది ఎంతో యాక్టివ్ గా పని చేస్తోంది. టాలీవుడ్ 24 శాఖల అసోసియేషన్లు సొంత ఆఫీస్ లను సమకూర్చుకున్నాయి. అదే తీరుగా టీఎంటీఏయు సొంత ఆఫీస్ (సొంత భవంతి) నిర్మాణం కోసం ప్రయత్నిస్తోందని కూడా సంఘం ఈసీ సభ్యులు వెల్లడించారు.