అప్పుడు చిరుతో, ఇప్పుడు బాలయ్యతో... బాబీ ముద్దు ముచ్చట

బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు సంక్రాంతి రేసులో వెనక పడ్డా విడుదల తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తోంది

Update: 2025-01-13 21:30 GMT

బాలకృష్ణ 'డాకు మహారాజ్‌' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు సంక్రాంతి రేసులో వెనక పడ్డా విడుదల తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలైన మొదటి రోజే దాదాపు పాతిక కోట్ల షేర్‌ రాబట్టిన డాకు మహారాజ్ సినిమా రెండు వారాల్లో బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం ఖాయం అనే అభిప్రాయంను బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్‌గా డాకు మాహారాజ్ సినిమా హిట్‌ చిత్రాల జాబితాలోకి చేరినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక నందమూరి ఫ్యాన్స్ సినిమా సూపర్ డూపర్‌ హిట్‌ అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

సినిమా సక్సెస్‌ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్‌ పార్టీని ఏర్పాటు చేశారు. నిర్మాత నాగవంశీ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో హీరో బాలకృష్ణతో పాటు హీరోయిన్స్‌, యంగ్‌ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌ సేన్‌ ఇంకా దర్శకుడు బాబీ ఇతర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ పార్టీలో హీరోయిన్‌ ఊర్వశి రౌతేలాతో కలిసి బాలకృష్ణ వేసిన డాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇక సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌ సేన్‌లకు పెట్టిన ముద్దు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సమయంలో దర్శకుడు బాబీకి బాలకృష్ణ పెట్టిన ముద్దు ఫోటో కూడా సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

గతంలో వాల్తేరు వీరయ్య సినిమా హిట్ సమయంలో చిరంజీవి సైతం దర్శకుడు బాబీకి ముద్దు పెట్టిన విషయం తెల్సిందే. ఆ ఫోటోను ఇప్పుడు బాలకృష్ణ ముద్దు పెట్టిన ఫోటోను సోషల్‌ మీడియాలో కొందరు కలిపి షేర్‌ చేస్తున్నారు. ఇద్దరు స్టార్‌ హీరోల అభిమానం ఈ స్థాయిలో దక్కించుకున్న దర్శకుడు బాబీ ఎంతటి అదృష్టవంతుడు అంటూ ఈ జెనరేషన్‌ దర్శకులు మాట్లాడుకుంటూ ఉంటారు. తాను చిరంజీవి అభిమానిని అని, బాలకృష్ణ అభిమానిని అని, వారి అభిమానులు ఎలా అయితే చూడాలి అనుకుంటారో అనేది తనకు తెలుసు. కనుక తాను వారి ఆలోచనలకు తగ్గట్లుగా సినిమాను చేస్తాను అంటూ బాబీ చెప్పడం మాత్రమే కాకుండా చేసి చూపించాడు.

వాల్తేరు వీరయ్య వచ్చిన రెండేళ్ల తర్వాత వచ్చిన డాకు మహారాజ్‌ సినిమా మరో విజయాన్ని బాబీ ఖాతాలో వేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇప్పటి వరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువ. వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దర్శకుడు బాబీ తదుపరి సినిమా ఎవరితో అయ్యి ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరోలను ఎలివేట్‌ చేయడంలో బాబీ తర్వాతే మరెవ్వరైనా అంటూ కొందరు సినీ ప్రేమికులు డాకు మహారాజ్‌ సినిమా తర్వాత మాట్లాడుకుంటూ ఉన్నారు. బాబీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నేపథ్యంలో ఆయనకు ఫుల్‌ డిమాండ్‌ పెరిగింది.

Tags:    

Similar News