భారీ సినిమాలతో ముందుంది ముసళ్ల పండగ
ఈ కాప్ డ్రామా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలన్న కుతూహాలం అభిమానుల్లో ఉంది.
బాలీవుడ్ లో వరుసగా భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. షాహిద్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `దేవా` విడుదలకు సిద్ధమైంది. ఈ కాప్ డ్రామా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలన్న కుతూహాలం అభిమానుల్లో ఉంది. టీజర్, ట్రైలర్ కి అద్భుత స్పందన వచ్చింది. పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో విడుదలవుతోంది గనుక 'దేవా' హిట్టవుతుందని అంతా భావిస్తున్నారు.
అయితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసే పెద్ద స్టార్ల సినిమాలు రిలీజ్ బరలో ఉన్నాయి. హృతిక్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందించిన 'వార్ 2' భారీ యాక్షన్ కంటెంట్ తో వస్తున్నందున ఈ చిత్రం 1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అంతా భావిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ - ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ మూవీ
'సికందర్'పైనా ఉత్సాహం నెలకొంది. కానీ మురుగదాస్ కి కొన్నేళ్లుగా హిట్టు అన్నదే లేదు. అదే సమయంలో సల్మాన్ ట్రాక్ రికార్డ్ కూడా ఏమంత బాలేదు. కానీ 'సికందర్' వీటన్నిటినీ అధిగమించి భారీ వసూళ్లను తేవాలని పరిశ్రమ కోరుకుంటోంది.
మరోవైపు ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన రెండు భారీ ఫ్రాంఛైజీ చిత్రాలు ఈ ఏడాది విడుదలకు వస్తున్నాయి. వీటిలో జాలీ ఎల్.ఎల్.బి 2, హౌస్ ఫుల్ 5 చిత్రాలపై భారీ హైప్ నెలకొంది. కామెడీ రొమాన్స్, యాక్షన్ కలగలుపుతో ఈ సినిమాలు జనాల్ని భారీగా థియేటర్లకు రప్పించగలవు. కానీ అక్షయ్ ఇటీవల ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేదు. అతడికి సరైన విజయం దక్కాల్సిన సందర్భమిది. ఈ సమయంలో అతడిని రాబోవు రెండు సినిమాలు ఆదుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
సింగం ఎగైన్ ఫ్లాపయ్యాక అజయ్ దేవగన్ చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా -సన్ ఆఫ్ సర్ధార్ 2. అయితే దశాబ్ధం తర్వాత ఈ ఫ్రాంఛైజీలో రెండో సినిమాని ప్లాన్ చేయడం మైనస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇది కామెడీ జానర్ సినిమా.. దేవగన్ మార్క్ యాక్షన్ ని బ్లెండ్ చేసి తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది వస్తున్న భారీ చిత్రాల్లో అవతార్ 3 కూడా ఉంది. క్రిస్మస్ కానుకగా అత్యంత భారీగా విడుదల కానుండడంతో ఇండియన్ సినిమాలకు పోటీగా మారనుందని అంచనా. అయితే బాలీవుడ్ సరైన రిలీజ్ తేదీలతో కొన్నిటిని అధిగమించే ఛాన్సుంది. బాలీవుడ్ నుంచి రానున్న భారీ సినిమాలు రూ.500-1000 కోట్ల మధ్య వసూలు చేయడం గ్రేట్ కంబ్యాక్ అవుతుంది.