1200 కోట్ల ఆస్తిపరుడైన హీరోపై దాడి వెనక?!
రియల్ ప్రాపర్టీల రూపంలోనే సుమారు 900 కోట్లు పైగా ఆస్తులు ఉండగా, అతడు ఒక్కో సినిమాకి 15కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడు.
అతడి ఆస్తుల విలువ దాదాపు 1200 కోట్లు. ఇందులో ఒకే ఒక్క భవనం (ఆస్తి) ఖరీదు 800 కోట్లు.. రూ. 50 కోట్ల విలువైన మరో ఇల్లు బాంద్రాలో ఉంది. పాలీ హిల్స్ లోను ఖరీదైన సొంత అపార్ట్ మెంట్ లోను అతడు నివసించాడు. అలాగే పలుచోట్ల విలాసవంతమైన భవంతులు సైఫ్ ఖాన్ కి ఉన్నాయి. యూరప్ లోని స్విట్జర్లాండ్ గస్టాడ్ లో చెక్క ఇంటి కోసం అతడు ఏకంగా 30 కోట్లు పైగా వెచ్చించాడు. రియల్ ప్రాపర్టీల రూపంలోనే సుమారు 900 కోట్లు పైగా ఆస్తులు ఉండగా, అతడు ఒక్కో సినిమాకి 15కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడు.
అతడు మరెవరో కాదు.. సైఫ్ అలీఖాన్. అతడు రాజ కుటుంబానికి చెందినవాడు. మన్సూర్ అలీఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగూర్ దంపతుల కుమారుడు సైఫ్ ఖాన్. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ మెప్పించాడు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో రావణ్‌గా నటించాడు. ఎన్టీఆర్ దేవరలోను విలన్ పాత్రలో మెప్పించాడు.
సైఫ్ అలీ ఖాన్ కి గురుగ్రామ్‌లో పటౌడీ ప్యాలెస్ ఉంది. ఇది పటౌడీ నవాబ్ పూర్వీకుల స్థానం.. ఇది గుర్గావ్ నుండి ఒక గంట ప్రయాణ దూరంలో ఉంది. జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. మీడియా కథనాల ప్రకారం.. ఈ ప్యాలెస్ అంచనా విలువ రూ. 800 కోట్లు. ఇది షారుఖ్ `మన్నత్` ఖరీదు కంటే చాలా ఎక్కువ. మన్నత్ విలువ రూ. 200 కోట్లు కాగా, అమితాబ్ బచ్చన్ జల్సా మార్కెట్ విలువ దాదాపు రూ. 120 కోట్లు. టాలీవుడ్ లో రామ్ చరణ్ నిర్మించిన ఇల్లు ఖరీదు 100కోట్లు కాగా, వీటన్నిటి కంటే విలాసవంతమైన పటౌడీ ప్యాలెస్ గురించి చాలా ఎక్కువగా ముచ్చటించుకుంటున్నారు.
పటౌడీ సంస్థానం.. 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఆస్తిలో ఏడు డ్రెస్సింగ్ రూమ్‌లు, ఏడు బెడ్‌రూమ్‌లు, ఏడు బిలియర్డ్ రూమ్‌లతో 150 గదులు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు.. సైఫ్ స్విస్ ఆల్ప్స్‌లో కూడా సమయం గడుపుతాడు. అతడు జిస్టాడ్‌లో విలాసవంతమైన చాలెట్‌ని కలిగి ఉన్నాడు. దీని విలువ రూ. 33 కోట్లు.
సైఫ్ నికర ఆస్తుల విలువ రూ.1200 కోట్లు. విలాసవంతమైన, ఖరీదైన ఆస్తులే కాకుండా, అతడికి రూ. 3.3 కోట్ల విలువైన గడియారాలను సొంతం చేసుకున్నాడు. ఇందులో దాదాపు రూ. 32,58,000 విలువైన ది పాటెక్ ఫిలిప్స్ నాటిలస్, రూ. 27 లక్షల విలువైన రోలెక్స్ యాచ్‌మాస్టర్ 2, 23లక్షల విలువైన రోలెక్స్ సబ్‌మెరైనర్, రూ. 20 లక్షల ఖరీదైన లాంగే & సోహ్నే..ఉన్నాయి. సైఫ్ సేకరించిన వాటిలో అత్యంత ఖరీదైనది పటేక్ ఫిలిప్ క్రోనోగ్రాఫ్ వార్షిక క్యాలెండర్.. దీని విలువ రూ. 40 లక్షలు. బెంజ్ ఎస్ క్లాస్, ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కార్లు అతడి సొంతం. దుస్తులు, ఫుట్ వేర్, హోమ్ డెకార్ వంటి రంగాల్లో సైఫ్ ఖాన్ భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఇవన్నీ అధిక లాభాల్ని అందిస్తున్నాయి. అలాగే సైఫ్ గతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థను నమ్మి పెట్టుబడి పెట్టగా 40 కోట్లు నష్టపోయినట్టు వెల్లడించాడు.
సైఫ్ ఖాన్ బాంద్రా ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగుడు ఎదురు తిరిగిన సైఫ్ పై కత్తి పోట్లు పొడిచాడన్న వార్త కలకలం రేపింది. అదే సమయంలో సైఫ్ ఖాన్ కి ఎన్ని ఇండ్లు ఉన్నాయి? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా అతడికి చెందిన 800 కోట్ల విలువైన పటౌడీ సంస్థానం గురించి ప్రజలు ఎక్కువగా ఆరాలు తీస్తున్నారు.