అల్లు అర్జున్‌ని అనవసరంగా లాగారు.. బోనీ కపూర్ మద్ధతు..!
ఈ దుర్ఘటన అనంతరం అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ సహా ఇతర పరిణామాల గురించి తెలిసిందే.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక వివాహిత మృతి చెందగా, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 'పుష్ప 2` ప్రివ్యూ వీక్షించేందుకు వచ్చిన స్టార్ హీరో అల్లు అర్జున్ ని చూసేందుకు వచ్చిన అభిమానులకు ఊహించని షాకింగ్ ఘటన ఇది. ఈ దుర్ఘటన అనంతరం అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ సహా ఇతర పరిణామాల గురించి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన పెద్ద చర్చనీయాంశమైంది.
ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బోనీకపూర్ చేసిన ఒక వ్యాఖ్య హాట్ టాపిగ్గా మారింది. సంథ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ని అనవసరంగా లాగారని బోనీకపూర్ అన్నారు. జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌ను అన్యాయంగా నిందించారని, అతడి నిర్లక్ష్యం కంటే ప్రేక్షకుల్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్లనే ఘటన జరిగిందని బోనీ అభిప్రాయపడ్డారు. జనం ఎక్కువ గుమిగూడటం వల్లనే అలా జరిగిందని అన్నారు. ఫిలింమేకర్స్‌తో గలాట్టా ప్లస్ రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లో బోనీ పైవిధంగా స్పందించారు. అల్లు అర్జున్ కి అతడు మద్ధతుగా నిలిచారు.
ప్రీమియర్ల సమయంలో జనం గుమిగూడతారని, గందరగోళం ఉంటుందని కూడా బోనీ ఈ సమావేశంలో అన్నారు. ఈ సంఘటన థియేటర్ మేనేజ్‌మెంట్ సరైన క్రౌడ్ కంట్రోల్ చేయడంలో విఫలమైనందుకు విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. సంథ్య థియేటర్ ఘటనలో స్టార్ల బాధ్యత కంటే నిర్వాహకులు, అధికారుల బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుందని బోనీ వాదించారు. ఈ వివాదం ఎలా ఉన్నా.. పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇదే సమావేశంలో బోనీ కపూర్ అప్రయత్నంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్థావిస్తూ ''అతడు ఇంకా న్యూ ఫేస్'' అని వ్యాఖ్యానించారు. అయితే దానిని హీరో సిద్ధార్థ్ సరిచేస్తూ.. ఎన్టీఆర్ పరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్ అని వార్ 2లో హృతిక్ రోషన్ లాంటి పెద్ద స్టార్ తో కలిసి నటిస్తున్నాడని గుర్తు చేసారు. నిర్మాత నాగవంశీ కూడా తారక్ విషయంలో సిద్ధార్థ్ తో ఏకీభవిస్తూ .. ఎన్టీఆర్ పరిశ్రమలో న్యూ ఫేస్ కాదని అన్నారు.