ఈ వారం సినిమాలు.. ఏం తక్కువైనట్లు?

ఏప్రిల్ మాసం రెండో వారం బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాల సందడి ఉండబోతోంది.;

Update: 2025-04-09 10:46 GMT
ఈ వారం సినిమాలు.. ఏం తక్కువైనట్లు?

ఏప్రిల్ మాసం రెండో వారం బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాల సందడి ఉండబోతోంది. ఈ వారం రేపు, ఎల్లుండి మధ్య నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా ఈ స్థాయిలో రిలీజులు ఉన్నప్పుడు ముందస్తు హైప్, ప్రమోషన్లు, బుకింగ్స్ ఊపందుకుంటాయి. కానీ ఈసారి మాత్రం హడావిడి ఉన్నా, ప్రేక్షకుల్లో ఉత్సాహం అంతగా కనిపించడం లేదు. ట్రేడ్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.

టిల్లు క్యారెక్టర్ తో క్రేజ్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ సినిమా మొదట మంచి అంచనాలు తెచ్చుకున్నా, గ్రౌండ్ లెవెల్ హైప్ మాత్రం తక్కువగానే ఉంది. బుక్ మై షో ట్రెండింగ్లోకి ఎంటర్ కాకపోవడం, అడ్వాన్స్ బుకింగ్స్‌లో గణనీయమైన స్పైక్ లేకపోవడం బయ్యర్లను కొంత నిరాశపరుస్తోంది. టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడం వల్ల ‘జాక్’పై అంచనాలు ఎక్కువే అయినా, మార్కెట్‌లో ఆ అంచనాలకు సరిపడే ప్రభావం లేదు. ఇక సినిమా విడుదల తర్వాత టాక్ బాగా వస్తే మాత్రమే ఇది ఊపందుకోగలదనే అభిప్రాయం కనిపిస్తోంది.

ఇక తమిళ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తమిళనాడులో టికెట్ అమ్మకాల్లో దుమ్ము రేపుతోంది. కానీ తెలుగులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అజిత్ సినిమాలు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో కనీస స్థాయిలో కూడా ఆడటం లేదు. వలిమై, తెగింపు, పట్టుదల లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఓన్‌గా రిలీజ్ చేస్తున్నా, ఎగ్జైట్‌మెంట్ పెద్దగా లేదు. కేవలం టాక్ బాగుంటేనే దీనికి ఊపొస్తుందన్న ఆశ.

సన్నీ డియోల్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘జాట్’ మంచి టెక్నికల్ టీంతో రూపొందించినా, తెలుగు అనువాదం లేకపోవడం ఓ మైనస్ పాయింట్‌గా మారింది. గోపీచంద్ మలినేని, రమ్యకృష్ణ, జగపతిబాబు, రెజీనా, తమన్ వంటి తెలుగులో పేరొందిన వారు పని చేసినా, హిందీలోనే విడుదల పరిమితమవడంతో మన ప్రేక్షకుల్లో ఆసక్తి తక్కువగానే ఉంది. హిట్ టాక్ వస్తే మళ్లీ అనువాదం చేయవచ్చన్న ఆశలు ఉన్నా, అప్పటి వరకూ మాత్రం ఈ సినిమా ప్రభావం తెలుగు బాక్సాఫీస్ పై తక్కువే.

ఇక యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా కూడా బజ్ కోసం తపనపడుతోంది. గతంలో విడుదలైన కొన్ని కామెడీ డ్రామాలతో పోలిస్తే, ఈ చిత్రానికి కథలో కొత్తదనముందన్న టాక్ వినిపిస్తోంది. కామెడీ పరంగా పండిందన్న టాక్ వస్తే కానీ ఛాన్స్ లేదు, ఇది థియేటర్లలో పాజిటివ్ టాక్ రాబడితేనే మంచి రన్ ఉంటుంది. ఓవర్ నైట్ బ్లాక్ బస్టర్ అయ్యే టాలెంట్ ప్రదీప్‌కి ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వారం రిలీజ్ అయ్యే నాలుగు సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో కోణంలో పోటీ పడుతున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బాక్సాఫీస్ దగ్గర హైప్ తగ్గింది. టాక్ బాగుంటే మాత్రం ఎవరు నెగ్గుతారో అనేది తేలనుంది. మరి ఈ వారం సందడిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News