'అఖండ 2' బాలయ్య లేకున్నా ఆగేది లేదు!
కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న బాలకృష్ణ ప్రస్తుతం 'డాకు మహారాజ్' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి కాంబోలో నాల్గవ సినిమా కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది చివర్లో వీరి కాంబోలో నాలుగో సినిమా 'అఖండ 2' ప్రారంభం అయ్యింది. కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్న బాలకృష్ణ ప్రస్తుతం 'డాకు మహారాజ్' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి రాబోతున్న ఆ సినిమా ఈవెంట్స్‌తో పాటు ప్రత్యేక మీడియా సమావేశాల్లో బాలకృష్ణ హాజరు అవుతూ బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు అన్‌స్టాపబుల్ వరుస ఎపిసోడ్స్‌ను బాలయ్య చేస్తున్నారు.
డాకు మహారాజ్ సినిమాతో బాలకృష్ణ బిజీగా ఉన్నా బోయపాటి శ్రీను మాత్రం అఖండ 2 వర్క్ ఆపలేదు. గత కొన్ని రోజులుగా భారీ సెట్టింగ్స్ వేయిస్తున్న బోయపాటి శ్రీను సంక్రాంతి తర్వాత కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేపట్టబోతున్నారు. ఆ షెడ్యూల్‌లో బాలకృష్ణ పాల్గొనబోడు. విలన్‌తో పాటు కీలక పాత్రల్లో నటించే నటీనటులు మాత్రమే ఆ షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. డాకు మహారాజ్ విడుదలైన తర్వాత కనీసం రెండు వారాల విశ్రాంతి తీసుకోనున్న బాలకృష్ణ ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రారంభం కాబోతున్న షెడ్యూల్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. అఖండ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బోయపాటి పవర్ ఫుల్ కథను ఎంపిక చేశారని తెలుస్తోంది.
సనాతన ధర్మ గురించి ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సనాతన ధర్మం పై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా అఖండ 2 లో కొన్ని సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. అఖండలో అఘోర పాత్రలో కనిపించడం ద్వారా సర్‌ప్రైజ్ చేసిన బాలకృష్ణ మరోసారి అఖండ 2 లోని పాత్రతో సర్‌ప్రైజ్ చేయబోతున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అఖండ 2 సినిమాను ఈ ఏడాదిలోనే దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. బాలకృష్ణ సినిమాలకు వరుసగా ఐదో సారి తమన్ వర్క్ చేస్తున్నాడు. అఖండ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి మంచి స్పందన దక్కిన విషయం తెల్సిందే. అందుకే అఖండ 2 లో తమన్ అంతకు మించి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తాడేమో చూడాలి.
అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంటే డబుల్ హ్యాట్రిక్ కానుంది. దాంతో అఖండ 2 కి మరింత అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలు మాత్రమే కాకుండా యంగ్ హీరోల్లోనూ వరుసగా మూడు భారీ విజయాలు దక్కిన హీరోలు చాలా అరుదుగా మాత్రమే ఉన్నారు. బాలకృష్ణ ఖాతాలో నాలుగో విజయం పడనుందా అనేది తెలియాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.