ఆర్సీ16 టీమ్ తో బుచ్చిబాబు బర్త్‌డే సెలబ్రేషన్స్
ఇవాళ బుచ్చిబాబు బర్త్ డే సందర్భంగా పలువరు దర్శకనిర్మాతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మొదటి సినిమాతో రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్న డైరెక్టర్ గా బుచ్చిబాబు సాన రికార్డు సృష్టించాడు. అంతేకాదు తను దర్శకత్వం వహించిన మొదటి సినిమాకే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు బుచ్చిబాబు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు 2021లో ఉప్పెన మూవీ ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.
ఇవాళ బుచ్చిబాబు బర్త్ డే సందర్భంగా పలువరు దర్శకనిర్మాతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం బుచ్చిబాబు చరణ్ తో ఆర్సీ16 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ చిత్ర యూనిట్ అంతా బుచ్చిబాబు బర్త్ డే ను సెలబ్రేట్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ లో చిత్ర నిర్మాతలతో పాటూ ఆర్సీ16 టీమ్ పాల్గొంది.
ఇక బుచ్చిబాబు ఫిల్మోగ్రఫీ విషయానికొస్తే, సుకుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఉప్పెన సినిమా ద్వారానే వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఉప్పెన హిట్ అవడంతో వారిద్దరికీ వరుస ఆఫర్లు వచ్చాయి. వచ్చిన ఆఫర్లను అందుకుంటూ వైష్ణవ్, కృతి పలు సినిమాలు చేశారు.
కానీ బుచ్చిబాబు మాత్రం రెండో సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొదటి సినిమా సక్సెస్ అయిన జోష్‌లో బుచ్చిబాబు వరుసపెట్టి సినిమాలు చేస్తాడనుకుంటే అతను మాత్రం రెండో ప్రాజెక్టును మొదటి దాన్ని మించి తీయాలని కసితో కష్టపడ్డాడు. స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఈ కథను పెద్ద హీరోతోనే తీయాలని పట్టు పట్టడంతో బుచ్చిబాబు రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి బాగా టైమ్ పట్టింది.
వాస్తవానికి బుచ్చిబాబు తన రెండో సినిమాను ఎన్టీఆర్ తోనే చేయాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. దీంతో బుచ్చిబాబు రెండో సినిమాను రామ్ చరణ్ తో చేయాలని డిసైడ్ అయ్యి, అతని కోసం వెయిట్ చేసేసరికి సినిమా బాగా లేటైంది. అయితే ఈ ఆలస్యాన్ని కూడా బుచ్చిబాబు సినిమా కథ కోసం వాడుకున్నాడు.
చరణ్ ఫ్రీ అయ్యే లోపు మొత్తం క్యాస్టింగ్ దగ్గర నుంచి టెక్నీషియన్ల వరకు, సెట్స్ నుంచి షెడ్యూల్స్ వరకు అన్నీ ప్లాన్ చేసి రెడీ అయిపోయాడు. అందుకే చరణ్ ఫ్రీ అవగానే బుచ్చిబాబు సెట్స్ లో జాయిన్ అవగలిగాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్సీ16కు రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.