బుల్లిరాజుకి జనసేనతో కనెక్షన్ ఏంటో తెలుసా?
సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో ఆ పిల్లాడు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.
సంక్రాంతి కానుకగా వచ్చిన మూడు సినిమాల్లో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం'కి హిట్ టాక్ దక్కింది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజుల్లోనే దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమాలో బుల్లిరాజు పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బుల్లి రాజు పాత్రలో రేవంత్ అనే కుర్రాడు నటించాడు. సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో ఆ పిల్లాడు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. రేవంత్ సోషల్ మీడియా లో తెగ యాక్టివ్‌గా ఉంటున్నాడు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వైరల్ అవుతున్నాడు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు పాత్రను కొంతమంది విమర్శిస్తూ ఉన్నా ఎక్కువ శాతం మంది పిల్లాడి కామెడీ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ ని ఇమిటేట్ చేస్తూ వేసిన స్టెప్స్, కొన్ని ఫన్నీ డైలాగ్స్ కారణంగా రేవంత్ వైరల్ అవుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అని చెప్పుకొచ్చాడు. జనసేన పార్టీ కోసం గత ఎన్నికల సమయంలో ప్రచారం చేసినట్లు పేర్కొన్నాడు. జనసేన పార్టీకి ఓటు వేయమంటూ ఓటర్లను అడుగుతూ ఇంటింటికి రేవంత్ ప్రచారం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
గతంలో ఆ వీడియోను చూసి అనిల్ రావిపూడి గారు తనకు ఛాన్స్ ఇచ్చారని బుల్లిరాజు చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో జనసేన పార్టీకి ప్రచారం చేసినట్లుగా రేవంత్ చెప్పుకొచ్చాడు. తాను ప్రచారం చేసిన వీడియోను చూసిన అనిల్ రావిపూడి గారు ఆడిషన్స్‌కి పిలిచారు. ఆడిషన్స్ తర్వాత తనను సెలక్ట్ చేశారని, షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేశానంటూ బుల్లిరాజు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమాలోని బుల్లిరాజు పాత్ర కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే రాబోయే రోజుల్లో బుల్లిరాజు టాలీవుడ్‌లో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
దర్శకుడు అనిల్ రావిపూడి పాత్రల ఎంపిక విషయంలో చూపించిన శ్రద్ధ కారణంగానే సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. ఎప్పుడో సోషల్ మీడియాలో రేవంత్ అనే కుర్రాడి వీడియోను చూసి అతడిని బుల్లి రాజు పాత్రకు తీసుకుంటే బాగుంటుందని ఆడిషన్స్ నిర్వహించి తీసుకోవడం జరిగింది. దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాలోని ప్రతి పాత్రకు ఏ స్థాయిలో ప్రాముఖ్యతను ఇస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రగా ఇప్పుడు బుల్లిరాజు పాత్ర నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఇచ్చిన అవకాశంను రేవంత్ సద్వినియోగం చేసుకుని ప్రేక్షకులను నవ్వించాడు. పవన్ కళ్యాణ్ అభిమాని బుల్లిరాజు అంటూ సోషల్ మీడియాలో రేవంత్‌కి మరింతగా గుర్తింపు లభిస్తుంది. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల్లో ఈ బుడ్డోడు మరింత సందడి చేయడం కన్ఫర్మ్.