సంధ్య 70ఎంఎం విషాదం: అల్లు అర్జున్ పై కేసు నమోదు
హైదరాబాద్‌లోని RTC X రోడ్స్‌లోని సంధ్య 70ఎంఎం థియేటర్‌లో జరిగిన విషాదం అందరి హృదయాలను కలిచివేసింది.
అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' గత రాత్రి ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలైన సంగతి తెలిసిందే. తమ ఫేవరెట్ సినిమా వీక్షించేందుకు అభిమానులు చాలా ఉత్సాహంగా థియేటర్లకు తరలి వస్తున్నారు. హైదరాబాద్‌లోని RTC X రోడ్స్‌లోని సంధ్య 70ఎంఎం థియేటర్‌లో జరిగిన విషాదం అందరి హృదయాలను కలిచివేసింది. సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద అల్లు అర్జున్ సందర్శన సమయంలో సంభవించిన తొక్కిసలాట ఫలితంగా రేవతి అనే మహిళ మరణించగా, ఆమె 13 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈరోజు ప్రెస్ నోట్ విడుదల చేశారు. థియేటర్ మేనేజ్‌మెంట్‌కి వారి రాక గురించి సమాచారం ఉన్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రేక్షకులను నిర్వహించడానికి థియేటర్ మేనేజ్‌మెంట్ భద్రతకు సంబంధించి ఎటువంటి అదనపు నిబంధనలను పాటించలేదని, అలాగే నటుడు అల్లు అర్జున్, అతడి బృందానికి వేర్వేరు ఎంట్రీ లేదా ఎగ్జిట్ పాయింట్లు లేవని కమిషనర్ చెప్పారు.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సెక్షన్ 105, 118 (1) r/w 3(5) BNS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. థియేటర్ లోపల ఒక వ్యక్తి మరణానికి.. ఒకరికి గాయం కావడానికి దారితీసిన అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వ్యక్తులందరిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోనున్నారు'' అని ఆయన ముగించారు.