సూపర్‌స్టార్‌కి ఇద్దరు ముఖ్యమంత్రుల శుభాకాంక్షలు
వీరిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఉన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబరు 12 నాటికి తన 74వ ఏట అడుగుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు తలైవాపై తమ ప్రేమాభిమానాలను చాటుకుంటూ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. సోషల్ మీడియాల్లో రజనీ ఆహార్యానికి సంబంధించిన చక్కని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
రజనీకి ఇద్దరు ముఖ్యమంత్రుల నుంచి శుభాకాంక్షలు అందాయి. వీరిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఉన్నారు. X లో ఒక పోస్ట్‌లో నారా చంద్రబాబు నాయుడు విషెస్ చెబుతూ.. నా ప్రియ మిత్రుడు, లెజెండరీ రజనీకాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. కెరీర్ లో మరిన్ని విజయాలను సాధించాలి'' అని విష్ చేసారు. ఎం.కే స్టాలిన్ సైతం సూపర్‌స్టార్‌కి తన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ''సరిహద్దులు దాటి, తన నటన, శైలితో ఆరు నుండి అరవై ఏళ్ల వరకూ అభిమానులను సంపాదించిన నా అద్భుతమైన స్నేహితుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు! సినీ పరిశ్రమలో నిరంతర విజయాలు సాధిస్తున్న మీరు ఎల్లప్పుడూ శాంతియుతంగా, సంతోషంగా ఉండాలని, ప్రజలను మెప్పించాలని కోరుకుంటున్నాను'' అని #HBDసూపర్‌స్టార్ రజనీకాంత్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి స్టాలిన్ రాశారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, విశ్వనటుడు కమల్ హాసన్, ఎస్.జే సూర్య తదితరులు రజనీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
తలైవా రజనీకాంత్ కెరీర్ నాలుగు దశాబ్దాలకు పైగా అజేయంగా కొనసాగింది. ఇప్పటికీ యువహీరోలతో పోటీపడుతూ రజనీ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు సహా పలు భాషల చిత్రాలలో నటించారు రజనీ. సూపర్‌స్టార్ ఆహార్యం యూనిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ తదుపరి మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నారు. అలాగే జైలర్ 2లోను నటిస్తారని సమాచారం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోని తదుపరి చిత్రం 'కూలీ' వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.