'దేవుడు మంచి కోసం ఇవన్నీ చేస్తాడు'.. విడాకుల తర్వాత ధనశ్రీ పోస్ట్
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ ఇద్దరూ గతంలో తమపై పుకార్లు ప్రచార చేయవద్దని కోరారు. నిరాధార వార్తలు ప్రచురించవద్దని కోరిన దాదాపు ఒక నెల తర్వాత విడాకులు వచ్చాయి.
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నుండి విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చిన కొన్ని గంటలకు ధనశ్రీ వర్మ ఇన్‌స్టాలో ఒక క్రిప్టిక్ పోస్ట్ తో తన మనసులోని మాటను వెల్లడించారు. ఒత్తిడి నుంచి విముక్తితో ధన్యుల వరకూ.. అనే క్యాప్షన్ తో ధనశ్రీ ఒక నోట్ రాసారు. ''దేవుడు మన బాధలు పరీక్షలను చివరికి ఆశీర్వాదాలుగా ఎలా మార్చగలడో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రోజు దేని గురించి అయినా ఒత్తిడికి గురైతే మీకు మరో అవకాశం ఉందని తెలుసుకోండి. మీరు చింతిస్తూ ఉండవచ్చు.. కానీ అన్నింటినీ దేవుడిపై భారం మోపి ప్రార్థించండి. దేవుడు మీ మంచి కోసం ఇవన్నీ చేస్తాడని నమ్మడం శక్తినిస్తుంది'' అని రాసారు.
ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం..ఈ జంట విడాకులపై తుది విచారణ గురువారం (ఫిబ్రవరి 20) నాడు బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగింది. విడాకుల విచారణకు సంబంధించిన ప్రక్రియ గురువారం ఉదయం 11:00 గంటలకు మొదలైంది. సాయంత్రానికి న్యాయమూర్తి విడాకుల మంజూరును ఖరారు చేసారని కథనాలొచ్చాయి. కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పుడు చాహల్- ధనశ్రీ ఇద్దరూ హాజరయ్యారు. 45 నిమిషాల కౌన్సెలింగ్ సెషన్ తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడానికి పట్టుదలగా నిలబడటంతో జడ్జి తుది తీర్పును వెలువరించారు. భార్యాభర్తలు తప్పనిసరి అని పట్టుబడితే విడాకులు మంజూరు చేసేందుకు ఇప్పుడు చట్టంలో వెసులుబాటును ఈ జంట ఉపయోగించుకుంది.
యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ ఇద్దరూ గతంలో తమపై పుకార్లు ప్రచార చేయవద్దని కోరారు. నిరాధార వార్తలు ప్రచురించవద్దని కోరిన దాదాపు ఒక నెల తర్వాత విడాకులు వచ్చాయి. ఎట్టకేలకు కొన్ని నెలల పాటు సాగిన విడాకుల డ్రామాకు కోర్టు ముగింపు పలికిందని ఆంగ్ల మీడియాలు ధృవీకరించాయి.
ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ పేరు నుండి 'చాహల్'ను తొలగించిన తర్వాత మొదటిసారి ఈ జంట విడాకుల గురించి ఊహాగానాలు చెలరేగాయి. యుజ్వేంద్ర చాహల్ ''న్యూ లైఫ్ లోడింగ్' అని వ్యాఖ్యానిస్తూ ఒక క్రిప్టిక్ పోస్ట్ చేసిన తర్వాత ధనశ్రీ వర్మ క్రిప్టిక్ పోస్ట్ వైరల్ అయింది. 11 డిసెంబర్ 2020న గురుగ్రామ్‌లో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ధనశ్రీ వర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంట డ్యాన్స్ క్లాసుల్లో కలుసుకున్నప్పుడు ప్రేమ వికసించింది. కానీ నాలుగేళ్లలో సంసారంలో కలతలతో విడిపోయారు.