తండేల్.. సౌండ్ ముఖ్యమా? దర్శకుడి పనితనమా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తండేల్ దర్శకుడు చందు మొండేటికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
నాగచైతన్య - సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో చందు మొండేటి దర్శకత్వం వహించిన `తండేల్` ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ జైలులో చిక్కుకున్న శ్రీకాకుళం మత్సకారుడి కథాంశంతో తెరకెక్కిన ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో నాగచైతన్య- సాయిపల్లవి జంట ప్రేమకథ ప్రధాన ఆకర్షణ కానుందని టీమ్ చెబుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తండేల్ దర్శకుడు చందు మొండేటికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నిజానికి సినిమా రిలీజయ్యే చివరి నిమిషం వరకూ ఏదో ఒక మార్పు చేర్పులు అంటూ హడావుడిగా, టెన్షన్ గా ఉంటారు. నేపథ్య సంగీతం లేదా కూర్పు ఏదో ఒకటి బెటర్ మెంట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలా ప్రతి సినిమా విషయంలో జరుగుతుంది. ఎందుకలా? అని చందు మొండేటిని ప్రశ్నించగా, దానికి అతడు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
నిజానికి సినిమా అంతా చిత్రీకరించాక చివరిలో ఫుటేజ్ సంగీత దర్శకుడి వద్దకు వెళుతుంది. అందువల్ల అతడికి తక్కువ సమయం ఉంటుంది. అంతేకాదు.. ఒకసారి నేపథ్య సంగీతం పూర్తయాక కూడా ఏదో ఒక మార్పు చెబుతుంటారు దర్శకులు. దానివల్ల ఎడిట్, కట్ చెప్పినప్పుడు తొలగించిన సన్నివేశానికి అనుగుణంగా బ్యాక్ గ్రౌండ్ ని సింక్ చేయాల్సి వస్తుంది. దీనికి గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. చివరి నిమిషం వరకూ ఏదో ఒక మార్పు ఉంటూనే ఉంటుంది.
ఇంకా పనుంటే బావుణ్ణు.. అంటూ రిలీజ్ వరకూ ఏదో ఒక పని కావాలని దర్శకుడికి ఉంటుందని చందు మొండేటి అన్నారు. నిజానికి అందరి కంటే అత్యుత్తమంగా సినిమాని వేరే లెవల్ కి తీసుకెళ్లేది సౌండ్. మా తరపు నుంచి అందరి కంటే చివరిలో సంగీత దర్శకుడికి విజువల్స్ ని ఇస్తాం. నిజానికి రిలీజ్ చివరి రోజు వరకూ సౌండ్ తో పని ఉంటుంది. ఇది సైకలాజికల్ ప్రాసెస్ అనుకుంటాను. అంతేకాదు... చివరిలో పని ఇచ్చి సంగీత దర్శకుడు సమయానికి పూర్తి చేయలేదని వారి మీదకు నెట్టేయలేం. నేను జనరలైజ్ చేసి సంగీత దర్శకులను తప్పు పట్టలేను. తండేల్ ఆర్.ఆర్. కోసం మేం సినిమాని పంపించాం. దేవీశ్రీ ఒకటో వెర్షన్ రెండో వెర్షన్ వర్క్ చేశాక కూడా మేం చేసే ఒకట్రెండు మార్పుల కోసం వెర్షన్ 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఫ్రేమ్ మార్చినా గంటల కొద్దీ సమయం పడుతుందని సంగీత దర్శకులు చెబుతారు. చాలా దిగమింగుకుని గౌరవం కోసం దేవీశ్రీ అలా పని చేస్తూనే ఉన్నాడు. అయితే చివరి నిమిషం వరకూ సినిమా ఔట్ పుట్ బావుండడం కోసం ఏదో ఒక మార్పు చేస్తూనే ఉంటాం. ఏదైనా ఫలానా నిమిషంలో ఉన్న సీన్ ని తీసేసాక కూడా మరోసారి ఫైనల్ వెర్షన్ చూస్తే ఆ సీన్ ఇక్కడ వేయాలి కదా! అని అనిపిస్తుంది.. ఇలాంటి కారణాలతో చివరి నిమిషం వరకూ పని చేయాల్సి ఉంటుందని చందు మొండేటి వివరించారు.
`తండేల్` ఫైనల్ మిక్స్ అయింది. ఒక వారం ముందే తొలి కాపీతో సిద్ధంగా ఉన్నామని తండేల్ దర్శకుడు అన్నారు.
2.25 నిమిషాల సినిమా తండేల్.. 20-25 ని.ల ఫుటేజ్ ని ఎడిటర్ తొలగించారని తెలిపారు. తండేల్ భావోద్వేగాలతో నిండిన సినిమా. 2. 45 ని.లు సినిమా నా వరకూ. కానీ 25 ని.లు ఎడిటింగ్ లో తీసేసినా కానీ ఎమోషన్ ఏదీ మిస్ కాకుండా నవీన్ నూలి అద్భుతంగా ఎడిట్ చేసారు. కొన్ని సీన్స్ ఎడిట్ చేస్తుంటే, గుచ్చుకున్నట్టు అనిపించినా ఫైనల్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని సంతృప్తి చెందానని చందు తెలిపారు.