తెలుగులో ‘ఛావా’ జోరు.. వసూళ్ల డోస్ రెండో రోజు పెరిగిందిగా!
విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద క్రమంగా తన సత్తా చాటుతోంది.;
సాధారణంగా హిందీ నుంచి తెలుగులో డబ్ అయ్యే సినిమాలు ఒక పరిమితి వరకు మాత్రమే వసూళ్లు సాధిస్తాయి. కానీ ఈసారి విభిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద క్రమంగా తన సత్తా చాటుతోంది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, రెండో రోజు మాత్రం ఆశించిన దాని కంటే ఎక్కువ వసూళ్లు సాధించడం గమనార్హం. తెలుగు ప్రేక్షకుల స్పందన విశేషంగా మారిపోవడం గమనించదగిన అంశంగా మారింది.
ఈ సినిమా విడుదలకు ముందు ‘ఛావా’ గురించి పెద్దగా అంచనాలు లేకపోయినా, విడుదలైన వెంటనే దీనికి వస్తున్న రెస్పాన్స్ మరో లెవెల్ లో ఉంది. మొదటి రోజు దాదాపు 2.9 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు మాత్రం 6.81 కోట్లకు చేరుకుంది. సాధారణంగా మౌత్ టాక్ బలంగా లేకపోతే రెండో రోజు వసూళ్లు డ్రాప్ అవ్వడం సహజం. కానీ ‘ఛావా’ విషయంలో ఎటువంటి తగ్గుదల లేకుండా, మరింత ఆదరణ లభించడం విశేషం. ఇది కేవలం ఓ డబ్ మూవీ కాదు, తెలుగులోనూ ఓ స్ట్రాంగ్ పేస్‌తో కొనసాగే సినిమా అనే సంకేతాలు అందుతున్నాయి.
ఇక బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా హై రేంజ్‌లో ఉన్నాయి. మొదటి రోజు 57,000 టికెట్లు బుకింగ్ కాగా, రెండో రోజుకు ఈ సంఖ్య 69,000 దాటిపోయింది. ట్రేడ్ అనలిస్ట్‌ల వాదన ప్రకారం, ఆదివారం కలెక్షన్లు 10 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా రెండో రోజు మరింత వేగాన్ని అందుకోవడం చాలా అరుదు. దీనికి ప్రధాన కారణం సినిమా కథ, నటన, విజువల్ ప్రెజెంటేషన్ అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే.
వాస్తవానికి తెలుగులో వేరే పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ‘ఛావా’ కు అనుకూలంగా మారింది. ‘గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ ద్వారా విడుదలైన ఈ చిత్రం, ప్రమోషన్స్ పరంగా పెద్దగా హడావుడి చేయకుండానే జనాల్లోకి వెళ్లి ఓ వర్గాన్ని ఆకర్షించగలిగింది. సినిమా హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందినప్పటికీ, ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ కరెక్ట్ గా రావడంతో, వసూళ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విక్కీ కౌశల్ నటన, సినిమాలోని గ్రిప్పింగ్ నేరేషన్ తెలుగులో ఈ స్థాయిలో హిట్ అవ్వడానికి ప్రధాన కారణంగా నిలిచాయి.
ఇప్పటి వరకు హిందీ డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ అంతగా ప్రాధాన్యత లభించలేదు. కానీ ‘ఛావా’ రెండో రోజు చేసిన వసూళ్లు, ఈ ట్రెండ్‌ను మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఈ సినిమా కథ బలాన్ని మాత్రమే కాకుండా, తెలుగు ప్రేక్షకులు కొత్త కథలకు ఎంత ఆసక్తిగా ఉన్నారనేదానికీ నిదర్శనం. ఇలాంటి ప్రయోగాత్మకమైన కథలకు మరింత ఆదరణ పెరిగితే, భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన సినిమాలు ఇక్కడ మునుపటి కంటే మెరుగైన స్థాయిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ వారం కూడా ‘ఛావా’ వసూళ్లు తగ్గకుండా కొనసాగితే, తెలుగులో హిందీ డబ్బింగ్ సినిమాల రేంజ్‌ను కొత్త రేంజ్ కు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈరోజు నుంచి వర్కింగ్ డేస్ మొదలవ్వనున్న నేపథ్యంలో, వీకెండ్ స్ట్రాంగ్ రన్ ఈ సినిమాకు ఎంత వరకూ కొనసాగుతుందో చూడాలి. కానీ ఇప్పటి వరకూ వచ్చిన ట్రెండ్ చూస్తే, ‘ఛావా’ మరో వారంనాళ్ల పాటు బాక్సాఫీస్ పై జోరుగా నడుస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.